విధాత: బీహెచ్ఈఎల్ కోసం జగదీష్ గౌడ్ కుటుంబం 200 ఎకరాలు కోల్పోయిందని, ఇలా ప్రజల మంచిని కోరే కుటుంబానికి చెందిన జగదీష్ గౌడ్ ను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి శేరిలింగంపల్లి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని మీరు భావిస్తే, భూములను అక్రమించుకుని తెగనమ్ముకుని అన్యాయం చేసిన ఎమ్మెల్యే గాంధీని ఈ ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపు ఇచ్చారు.
శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ ను గెలిపించండి…నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని రేవంత్ అన్నారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టాల్సిన బాధ్యత మీపై ఉందా? లేదా? అని అడిగారు. ఉద్యమంలో సమిధలైన నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోని కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో పాతరేయాలన్నారు. 30 లక్షల నిరుద్యోగుల గురించి ఆలోచించని కేసీఆర్… ఆయన మనవడిని మంత్రిని చేసేందుకు తాపత్రయపడుతున్నారన్నారు.