నిరంకుశ నిజాంకు ప‌ట్టిన గ‌తే క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి: రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బడ్జట్ లెక్కలు చూసుకుని పక్కాగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలిచ్చిందని, అధికారంలోకి రాగానే హామీలన్నింటిని అమలు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

నిరంకుశ నిజాంకు ప‌ట్టిన గ‌తే క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి: రేవంత్‌రెడ్డి
  • విజ‌న్‌లేని కేసీఆర్‌కు ఫెడ‌ర‌ల్ స్పూర్తి తెలియ‌దు
  • ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు
  • క‌మిటీ కాదు.. ఆర్డినెన్స్ తీసుకురా
  • డిసెంబ‌ర్ 4 నుంచి జరిగే స‌మావేశాల్లో బిల్లుకు భేష‌ర‌త్తుగా మ‌ద్ద‌తు ఇస్తా
  • లెక్కలు చూసుకునే పక్కాగా హామిలిచ్చాం
  • ధరణితో కేసీఆర్ కుటుంబం భూదందా
  • కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు
  • మీట్ ద ప్రెస్‌లో పీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి


విధాత‌, హైద‌రాబాద్‌: నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ ను గద్దె దించాలని ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదని, తెలంగాణ ఆత్మగౌరవం కోసమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారన్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బ‌హిష్క‌ర‌ణ చేయ‌డానికి తెలంగాణ ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుంద‌న్న స‌మాచారం కేసీఆర్‌కు ఉంది కాబ‌ట్టే ఒక్క న‌న్నేకాదు, మొత్తం రెడ్ల‌ను తిడుతున్నాడ‌న్నారు.


ఆదివారం జర్నలిస్టు అధ్యయన వేదిక హైద్రాబాద్‌లో ఒక హెట‌ల్‌లో నిర్వ‌హించిన‌ మీట్ ది ప్రెస్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఉద్య‌మ కారుడు కాద‌ని, తెలంగాణ ఉద్య‌మాన్ని ఆక్ర‌మించుకున్నాడ‌న్నారు. ఆయ‌నకు రావాల్సిన దాని కంటే వేయి రెట్ల లాభం వ‌చ్చింద‌ని, ప‌ది త‌రాలు తిన్నా త‌ర‌గ‌నంత ఆస్తి సంపాదించుకున్నాడ‌ని ఆరోపించారు. నిమ్స్‌లో ఆయ‌న వారం రోజులు నిర‌హార దీక్ష చేస్తే ఆయ‌న‌తో పాటు కొడుకు, కూతురు, అల్లుడు, కోబ్ర‌ద‌ర్ కొడుకు అంతా బాగు ప‌డ్డార‌న్నారు. ఉద్య‌మ కారుల‌కు త‌గిన గుర్తింపు రాలేద‌న్నారు. ఉద్య‌మ కారుల‌ను గుర్తించి ఆదుకోవ‌డానికి యాక్ష‌న్ ప్లాన్ ఉంద‌ని, కోదండ‌రామ్‌కు బాధ్య‌తలు అప్ప‌గిస్తామ‌న్నారు. ఉద్య‌మకారుల‌కు గౌర‌వంగా ప‌ట్టా ఇస్తామ‌న్నారు.


12 మంది పార్టీ మారిన ఎమ్మ‌ల్యేల‌ను అసెంబ్లీ గేటులోప‌లికి కూడా అడుగు పెట్ట‌నీయ‌మ‌న్నారు. సీఎం కేసీఆర్‌కు విజన్ లేదన్నారు. పేరు, కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. కాంగ్రెస్ స్పష్టమైన విజన్‌తో రాష్ట్ర బడ్జెట్ లెక్కలు చూసుకుని ఆరు గ్యారంటీలతో పాటు, ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే హామీలన్నింటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌లో ఎవరు సీఎంగా ఉన్న ప్రజా దర్బార్ ను నిర్వహించి, ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్దరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.


ఆక‌లినైనా భ‌రిస్తుంది కానీ..


చరిత్ర చూస్తే తెలంగాణ స‌మాజం ఆకలినైనా భరించింది, కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాల‌కులు తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తే, స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం ఉద్యమించారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ ఆధిపత్య ధోరణి వ‌ల్ల‌, పదేళ్లుగా స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌లేద‌న్నారు. దీంతో మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని తెలిపారు. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలని కోరారు.


ఫెడ‌ర‌ల్ స్పూర్తి తెలియ‌ని కేసీఆర్‌


కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయ‌న అధికారాన్ని రాచరికం అనుకుంటున్నారన్నారు. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయని, 2వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఇచ్చే పెన్షన్‌ కంటే కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోందన్నారు. ఈ విష‌యంలో కేసీఆర్ సవాల్‌లో పస లేదన్నారు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు 1లక్షా 80వేల కోట్లు బాకీ పెట్టారని ఆరోపించారు.


డిపాజిట్లు రాని బీజేపీ బీసీని సీఎం చేస్తుందా.


బీసీల ఓట్ల‌ను చీల్చి కేసీఆర్‌కు స‌హ‌క‌రించే వ్యూహంలో భాగంగానే బీసీని సీఎం చేస్తాన‌ని బీజేపీ ప్ర‌క‌టించింద‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 105 సీట్ల‌లో డిపాజిట్ రాలేద‌ని, ఈ ఎన్నిక‌ల్లో 110 సీట్ల‌లో డిపాజిట్లు రావ‌ని అన్నారు. డిపాజిట్లు కూడా రాని బీజేపీ బీసీ సీఎం నినాదం చేయ‌డమంటే బీసీల‌ను అవ‌మానించ‌డ‌మేన‌న్నారు.


క‌మిటీ కాదు… బిల్లు పెట్టండి భేష‌ర‌త్తుగా మ‌ద్ద‌తు ఇస్తాం


ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై గ‌తంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో అమ‌లు చేస్తామని ప్ర‌క‌టించార‌ని, ఆయ‌న ఉద్యోగం పోయింది కానీ ఇప్పటికీ అతీగతి లేదని రేవంత్ అన్నారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా, బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదన్నారు. దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండా చీల్చేందుకే కమీటీతో కాలయాపన ఎత్తుగడకు బీజేపీ తెరలేపిందన్నారు. మంద కృష్ణకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఇవ్వాలని మోదీని కొరదామన్నారు. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చని, అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తామని తెలిపారు.


అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌


ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ధరణి మాటున లబ్ధి పొందిందన్నారు. ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తుందన్నారు.


కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తుండన్నారు. కేసీఆర్ ఇస్తున్న విద్యుత్ కొంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్ గడ్ నుంచి కాదా? అని అడిగారు. కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నైనా సంపూర్ణంగా అమలు చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. కేసీఆర్‌కు రైతు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు.


అధికారం కోల్పోతున్నామన్న భ‌యంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రేషనలైజేషన్ పేరుతో 12వేల పాఠశాలలు మూసేశారని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారని, యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ మేరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో సిట్ విచారణ నిస్పాక్షికంగా లేదన్నారు.


అత్యవసరం నిత్యవసరాలపైనే కాంగ్రెస్ దృష్టి


ఆదాయాన్నిపెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమని, అత్యవసరం నిత్యవసరాలపైన కాంగ్రెస్ దృష్టి పెడుతుందన్నారు. ప్రగతిభవన్‌ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్‌గా మారుస్తామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రపంచంతో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్‌లా ఉన్నవాటిని కూలగొట్టి కొత్తవాటిని కట్టే విధానాలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతుందన్నారు. సీఎం ఎవరనేదానిపై పార్టీ అధిష్టానం నిర్ణయమే అందరికి శిరోధార్యమన్నారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కక్షపూరిత ధోరణితో ఏనాడు వ్యవహరించలేదన్నారు.


యుద్ధ ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్‌బీసీ పూర్తి


కేసీఆర్ కాంగ్రెస్‌కు మంచిపేరు వస్తుందని భావించి ఎస్ఎల్బీసీ ని పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్నారు. రాజుల తరహాలో సొంత పేరు కోసం సచివాలయం కూల్చి కట్టారని, కాళేశ్వరం సైతం పేరు, కమిషన్ల కోసమే రీడిజైన్ చేసి 200శాతం అంచనాలు పెంచారన్నారు. మిషన్ కాకతీయ మొదలు కాళేశ్వరం వరకు అన్నింటా అవినీతి సొమ్ము కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు.


కాంగ్రెస్‌కు 80-85సీట్లు ఖాయం


రాష్ట్రంలో సంకీర్ణం హంగ్‌ అనే చర్చే లేదని, 80-85 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నాని, మార్పు కాంగ్రెస్‌తో సాధ్యమని నమ్ముతూ బీఆరెస్ పార్టీని బంగాళాఖాతాంలో కలపబోతున్నారన్నారు. నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, కాంగ్రెస్ పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు. కేసీఆర్ పాలనలా నిర్బంధాలు ఉండవని, కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చి ఆదుకుంటామన్నారు. భూ యజామానికి, కౌలు రైతులకు, రైతు కూలీలకు అందరికీ ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఇందులో గందరగోళం ఏమీ లేదన్నారు.


మా ఆరు గ్యారంటీలు అసాధ్యమన్న కేసీఆర్ దానికి రాజముద్ర వేశారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు. కాస్రా పహాణీ లాంటి మాన్యువల్ రికార్డులను యథాతథంగా భూమాత ద్వారా డిజిటలైజ్ చేస్తామన్నారు. ధరణి కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని, ధరణి పేరుతో జరిగిన దోపిడీపై సంపూర్ణంగా విచారణ చేపడతామన్నారు. కేసీఆర్ పాలనలో జరిగినంత దోపిడీ నిజాం కాలంలోనూ జరగలేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై సిటింగ్ హైకోర్టు జడ్జీతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.