Minister Jupally Krishna Rao: మళ్లీ నేను..నా పార్టీ గెలుస్తుందో లేదో…హామీ ఇవ్వలేను

వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో, కాంగ్రెస్ గెలుస్తుందో లేదో హామీ ఇవ్వలేనన్న జూపల్లి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వైరల్.

విధాత : వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో..నేను గెలిచినా నా పార్టీ గెలుస్తుందో లేదో..ఒకవేళ మా ప్రభుత్వం వచ్చినా ఈ స్కీమ్ ఇస్తుందో లేదో తెలియదని…అందుకే ఇందిరమ్మ ఇళ్లపై కొత్త హామీలు ఇచ్చి మోసం చేయలేనంటూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బోథ్‌లో లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వనన్నారు. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తానన్నారు. అనవసరపు హామీలిచ్చి మోసం చేయబోనంటూ చెప్పే క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు ట్రోలింగ్ చేస్తున్నారు. జూపల్లి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో వైరల్ గా మారాయి.

ఇదే సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారుల నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలా ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఫోన్ చేయాలని నా నంబర్ ప్రజలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ముందుకెళ్తోంది. ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేసిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చడానికి ప్రభుత్వ, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవు. సామాజిక రుగ్మ‌త‌ల‌ను రూపుమాపినప్పుడే.. న‌వ స‌మాజం నిర్మిత‌మ‌వుతుంది. కార్పొరేట్ చదువులకు, కార్పొరేట్ వైద్యానికి, ఆడాంబరాలకు పోయి చాలా మంది అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జూపల్లి సూచించారు.