రోడ్డు రోలర్‌.. దెబ్బకు సైడవుతున్న కారు

ఆ గుర్తు నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

విధాత : కారును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తును యుగ తులసీ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కామన్‌ సింబల్‌గా కేటాయిస్తు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆ గుర్తులను ఫ్రీజ్‌ చేయాలని బీఆరెస్‌ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. బీఆరెస్‌ ఎంపీలు వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శ సోమ భరత్‌లు ఎన్నికల సంఘాన్ని కలిసి కారు గుర్తు పోలిన గుర్తులతో తమకు ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని వివరించి, ఆ గుర్తులను ఎవరికి కేటాయించవద్దంటూ ఫిర్యాదు చేశారు.



గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రోడ్డు రోలర్‌ గుర్తు, రోటి మేకర్‌, ట్రక్‌ వంటి గుర్తులతో కారు గుర్తుకు పడాల్సిన వేలాది ఓట్లు వాటిపై పడటంతో బీఆరెస్‌ పార్టీ బాగానే ఓట్లు కోల్పోయింది. ట్రక్‌ గుర్తుతో నకిరేకల్‌ అసెంబ్లీ స్థానంతో పాటు రోటీమేకర్‌ గుర్తుతో దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఫలితం తారుమారైంది. 2018నకిరేల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి చిరుమర్తి లింగయ్యకు 93,699ఓట్లు రాగా, బీఆరెస్‌ అభ్యర్ధి వీరేశంకు 85,440ఓట్లు పోలవ్వగా, వీరేశంం 8259ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడ సమాజ్‌వాద్‌ ఫార్వర్డ బ్లాక్‌ పేరుతో ట్రక్కు గుర్తుతో పోటీ చేసిన దుబ్బ రవికుమార్‌కు 10,383ఓట్లు పోలవ్వడంతో వీరేశం ఓటమికి దారి తీసింది.



దుబ్బాక ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి 1079ఓట్ల తేడాతో ఓడిపోగా, రోటి మేకర్‌ గుర్తు స్వతంత్ర అభ్యర్ధి బండారు నాగరాజుకు 3,510ఓట్లు రావడం బీఆరెస్‌ ఓటమికి కారణమైంది. అంతకు ముందు దేవరకొండ, గజ్వేల్‌, జహీరాబాద్‌, సిర్పూర్‌, మునుగోడు, హుజూరాబాద్‌, డోర్నకల్‌ ఎన్నికల్లోనూ రోడ్డు రోలర్‌ గుర్తు అభ్యర్థులకు గణనీయ స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. 2022మునుగోడు ఉప ఎన్నికల్లోనూ యుగ తులసీ పార్టీ అభ్యర్ధి శివకుమార్‌కు 1880ఓట్లు పోలయ్యాయి.



నిజానికి ఆయా స్థానాల్లో అక్కడి ట్రక్‌, రోడ్డు రోలర్‌, రోటిమేకర్‌ గుర్తుల అభ్యర్థుల బలం కంటే అధికంగా ఓట్లు పోలవ్వడానికి ఓటర్లు వాటిని కారు గుర్తుగా పొరబడటమే ప్రధాన కారణంగా కనిపించింది. ఈ నేపధ్యంలో ట్రక్‌, రోడ్డు రోలర్, రోటిమేకర్‌ సహా కారుపోలిన పలు గుర్తులను ఎవరికి కేటాయించవద్దని 2014ఎన్నికల సందర్భంగా ఒకసారి ఎన్నికల సంఘాన్ని బీఆరెస్‌ పార్టీ కోరగా, ఫ్రీ సింబల్‌ జాబితా నుంచి తొలగించింది. 2020లో మరోసారి బీఆరెస్‌ పార్టీ ఇదే అంశంపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.



తాజాగా యుగ తులసి పార్టీకి రోడ్డు రోలర్‌ గుర్తును రెండు తెలుగు రాష్ట్రాలలో కామన్‌ సింబల్‌గా కేటాయించడంతో బీఆరెస్‌ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. 2014, 2018ఎన్నికల్లో బీఆరెస్‌కు మంచి గాలి ఉన్నప్పుడే కారును పోలిన గుర్తుల దెబ్బతో తల్లడిల్లింది.



వరుసగా పదేళ్లు అధికారంలో ఉండటం..ప్రతిపక్ష పార్టీలు గతంలో కంటే బలం పుంజుకోవడం, పలుచోట్ల త్రిముఖ పోటీల పరిస్థితుల నేపధ్యంలో వందల సంఖ్యలో ఓట్లు కూడా ఫలితాన్ని నిర్ణయించే ప్రమాదముంది. ఈ నేపధ్యంలో రోడ్డు రోలర్‌ గుర్తు ఎక్కడ తమకు నష్టదాయకంగా మారుతుందోనన్న బెంగతో మరోసారి ఎన్నికల సంఘం వద్ధ కారును పోలిన గుర్తుల కేటాయింపులు ఆపాలాంటు బీఆరెస్‌ పోరాటం చేస్తుండటం ఆసక్తికరం.