రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల దోపిడీ.. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్: ఈటల రాజేందర్

  • రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల దోపిడీ
  • దొంగల ముఠా నాయకుడు కేసీఆర్
  • భూములను కొల్లగొడుతున్నారు…
  • మోడీ ని విమర్శించే అర్హత కేటీఆర్ కు ఉందా?
  • నైతిక విలువలు లేని కుటుంబం
  • – బీజేపీ నేత ఈటల రాజేందర్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: భూముల పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొడుతున్న ముఠా కు నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అని మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ రాకను పురస్కరించుకొని బుధవారం మహబూబ్ నగర్ లో ఆయన సభా స్థలాన్ని పరిశీలించారు.


ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో దోపిడీ రాజ్యం ఏలుతున్నదని, బీఆర్ ఎస్ నాయకులంతా దొంగల ముఠాగా ఏర్పడి భూముల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. ఈ ముఠాకు కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. దేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర దేశాల నేతలే అబ్బురుపడుతుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.


మోడీ పాలమూరు వస్తుంటే, స్థాయిలేని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్థాయిని మించి మాట్లాడుతున్న కేటీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెప్తారన్నారు. మోడీని విమర్శించే అర్హత కేటీఆర్ కు ఉందా అని ఆలోచించుకోవాలన్నారు. నైతిక విలువలు లేని కేసీఆర్ కుటుంబం మోడీపై ఆరోపణలు చేసే హక్కు లేదని పేర్కొన్నారు. చంద్రయాన్ సక్సెస్, మహిళా బిల్లు ఆమోదం వంటివి దేశ చరిత్రలో మిగిలిపోతాయన్నారు.


ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తుంటే, దేశ ప్రజలు గర్వం గా భావిస్తున్నారన్నారు. మోడీ చరిష్మా చూసి కేసీఆర్ ముఠా తట్టుకోలేక పోతున్నారని ఈటల విమర్శించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని, కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు.ఈటల వెంట బీజేపీ సీనియర్ నేత ఆచారి, కృష్ణ వర్ధన్ రెడ్డి ఉన్నారు.