T. Harish Rao | బడి పిల్లలకు కారం బువ్వ.. మండిపడిన మాజీ మంత్రి టి.హరీశ్‌రావు

ప్రభుత్వాలు | బడీడు పిల్లలకు చదువుతో పాటు డ్రాప్ అవుట్స్ నివారణకు పౌష్టికాహారం అందించేందుకు అమలులోకి తెచ్చిన మధ్యాహ్న భోజనం పథకం అమలు నాసిరకంగా మారి విమర్శల పాలవుతుంది.

  • Publish Date - August 4, 2024 / 03:50 PM IST

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వాలు | బడీడు పిల్లలకు చదువుతో పాటు డ్రాప్ అవుట్స్ నివారణకు పౌష్టికాహారం అందించేందుకు అమలులోకి తెచ్చిన మధ్యాహ్న భోజనం పథకం అమలు నాసిరకంగా మారి విమర్శల పాలవుతుంది. మధ్యాహ్న భోజనానికి అందించే డబ్బులు చాలకపోవడం, నిర్వాహక ఎజెన్సీలకు సకాలంలో బిల్లులు అందకపోవడం, నిర్లక్ష్యం వంటి ఘటనలతో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అన్నంలో సరైన కూరలు లేకపోవడంతో కారం, నూనెతో అన్నం కలుపుకుని తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.

సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకున్నారని.. ప్రభుత్వం భావిభారత పౌరులతో ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం.. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం పథకం పెండింగ్‌ బిల్లులు, కార్మికుల జీతాలు చెల్లించి.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరారు.