రాష్ట్రంలో సర్వేలు చెబుతున్న అంశాల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒక కీలక అంశంగా కనిపిస్తున్నది. ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. బీఆరెస్.. గతంలో సాధించినట్టుగా ఏకపక్ష విజయం సాధించేందుకు అవకాశం లేదు. కాంగ్రెస్‌కు మొగ్గు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఘన విజయం సాధించకపోయినా.. ఏ పార్టీకి మెజార్టీ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత.. దాదాపు అనుకూల స్థాయితో సమానంగా పెరిగింది. అయితే.. ఒక్కసారిగా పరిస్థితి ఎందుకు మారిపోయింది? ఇది ఒక్కసారిగా మారిపోవడమా? లేక కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న వ్యతిరేకత.. ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తున్నదా? ఇది ఎన్నికల నాటికి ఏ రూపం తీసుకుంటుంది?
విధాత : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌కు ఏడెనిమిది నెలల ముందు రాష్ట్రంలో బీఆరెస్‌కు ఎదురేలేదు, ఆ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు అనే వాదనలు ఉండేవి. కానీ ఎన్నికల సమయంలో పార్టీలు కాదు.. ప్రజలే ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తారు. రాష్ట్రంలో బీఆరెస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అధికారపార్టీ తమ రెండు పర్యాయాల పాలనలో ఏమీ చేయలేదా? అంటే చేసింది. ప్రజలు అడగని కొన్ని పథకాలనూ అమలు చేసింది. అదే సమయంలో ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినవి పట్టించుకోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజలు అన్ని విషయాలను గుర్తించుకోరని, ఎన్నికల సమయం నాటికి అప్పటి పరిస్థితులకు, ప్రలోభాలకు ఓటు వేస్తారనే భావన ప్రజాప్రతినిధుల్లో ఉంటుంది. కానీ తమ నిరసనలను, తమ డిమాండ్లను, తమ ఆవేదనను పరిగణనలోకి తీసుకొని ఉంటే ప్రస్తుతం ఆ పార్టీ ఎన్నికల్లో ఎదురీదే పరిస్థితి రాకపోయేది అనేది జనాభిప్రాయం.
ప్రజా భాగస్వామ్యం లేకుంటే ప్రయోజనమేమి!
బీఆరెస్ నేతలు పదే పదే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్తు సరఫరా, కేసీఆర్ కిట్, పల్లె, పట్టణ ప్రగతి, కళ్యాణలక్ష్మీ\ షాదీముబారక్, హరితహారం, కాళేశ్వరం వంటి కార్యక్రమాల గురించి చెబుతూ ఉంటారు. వీటినే ప్రచారం చేస్తుంటారు. ఈ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలు దేశానికి నమూనాగా మారాయని చాటింపు వేస్తారు. అయితే.. ఇవి కాకుండా రాష్ట్రంలో ఇంకా ఏ సమస్యలూ లేవా? రాష్ట్రంలో ప్రజలు ఇంతకు మించి ఏమీ కోరుకోవడం లేదా? దశాబ్దాలుగా వివక్షకు, అణిచివేతకు, వెనుకబాటుకు గురైన తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లను బీఆరెస్ పాలన మొత్తం తుడిచేసిందా? అంటే అధికారపార్టీ నేతలు ఔననే సమాధానం ఇస్తారు. కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వ విధానాల్లో ప్రజల భాగస్వామ్యం లేకుంటే అవి ఎలాంటి పథకాలైనా, ఎలాంటి అభివృద్ధి అయినా ప్రయోజనం లేదంటారు.
ధరణిని సంస్కరిస్తేనే ప్రయోజనం
ధరణి వల్ల రైతులే కాదు పట్టణాల్లోనూ రిజిస్ట్రేషన్, అమ్మకాలు, కొనుగోళ్ల వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ నిపుణులు కూడా ధరణి పోర్టల్‌లో కొన్ని మార్పులు చేయాలని, దాన్ని సంస్కరిస్తేనే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాదు ఈ పోర్టల్ విషయంలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని పక్కదోవపట్టిస్తున్నారని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు, రైతు సంఘాలు విమర్శించాయి. అయినా కేసీఆర్ ప్రభుత్వం వారి విజ్ఞప్తులను, వాదనలను లెక్క చేయనేలేదు.
విభజన చట్టం ప్రకారం సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన అక్కడికి బదిలీ అయ్యారు. ఆ తర్వాతనైనా ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దుకుని.. వాస్తవాల ఆధారంగా ఆధారంగా ధరణి సమస్యలను పరిష్కరిస్తుందని ఆశించారు. కానీ అది జరగకపోగా, పలు నాటకీయంగ పరిణామాల్లో ఏపీకి బదిలీ అయిన సోమేశ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే కేసీఆర్.. ఆయనను సలహాదారుగా నియమించుకుని పక్కనే కూర్చొనబెట్టుకున్నారు. అప్పుడే ధరణి విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటనేది అందరికీ అర్థమైపోయింది. రైతుల అనేక అవస్థలకు కారణమైన ధరణి పోర్టల్‌ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్నట్టు అది అద్భుతమైన పోర్టల్ అయితే, ప్రజలు దానిపట్ల సానుకూలంగా ఉన్నారనుకుంటే కాంగ్రెస్ మాటకు ప్రజలు ఎందుకు కన్వీన్స్ అవుతున్నారు? అయినాసరే.. ఎన్నికల ప్రచారంలో ధరణిని పదేపదే ప్రస్తావించిన కేసీఆర్.. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిస్తున్నారు. ధరణి గురించి క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే, రచ్చబండ దగ్గర రైతులతో ముఖాముఖి మాట్లాడితే అన్ని విషయాలు అవగతమౌతాయని పరిశీలకులు అంటున్నారు. ధరణి విషయంలో బీఆరెస్ సరైన వైఖరితో ఉన్నదా? లేక కాంగ్రెస్ విధానమే కరెక్టా? అన్నది.. రాబోయే ఫలితాలే తేల్చబోతున్నాయి.
కోటల్లోకి ప్రవేశమేది?
రాజప్రాసాదాలను ప్రతిబింబించే కొత్త సచివాలయంలోకి, ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్‌లోకి సాధారణ ప్రజలు కాదు కదా.. అనుమతి లేనిదే మంత్రులు కూడా అడుగుపెట్టే వీలు లేదన్న అభిప్రాయాలు ప్రజల్లో బలంగానే ఉన్నాయి. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతుంటాయి. గతంలో పలువురు మంత్రులకు ప్రగతిభవన్‌లోకి ప్రవేశం దక్కలేదని వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే సీతక్కను సచివాలయంలోకి సైతం అనుమతించలేదు. ఇవన్నీ రాష్ట్రంలో దొరల పాలన సాగుతున్నదనే అభిప్రాయానికి ఊతమిచ్చాయి. ప్రజాభిప్రాయాలకు, ప్రజాస్వామిక గొంతులకు రాష్ట్రంలో చోటు లేదన్న వాదన కూడా ఉన్నది. ఉద్యమాలతో ఏర్పడిన రాష్ట్రంలో, ఆ ఉద్యమంలో భాగస్వామి అయిన బీఆరెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ధర్నా చౌక్‌ను ఎత్తేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించేవారికే తప్ప.. విమర్శకులకు చోటు లేదని ఈ ఉదంతం చాటింది. ఓటు వేసే సమయంలో ఇవన్నీ కూడా ప్రభావితం చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
నియామకాలపై నిర్ల్యక్షమే
నియామకాల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిరుద్యోగులు ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల ఆవేదనను కూడా అధికారపార్టీ అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎంతసేపూ తమ హయాంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని అంకెలు చెబుతున్నదేకానీ.. నిరుద్యోగులు ఏమనుకుంటున్నారన్నది ఆలోచించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతా బహుబాగున్నదని అనుకుంటే.. నియామకాల ప్రక్రియలో లోపాలపై కోర్టులు ఎందుకు మొట్టికాయలు వేస్తుంది? జాబ్ క్యాలెంటర్ ప్రకటిస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఈ ఐదేళ్లలో ఎందుకు అమలు చేయలేదు? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటే సమాధానం ఉండదు. వారు కూడా ఈ ఎన్నికల్లో ఎలాంటి వైఖరి తీసుకోనున్నారో ఫలితాల్లో తెలుస్తుంది. ఇట్లా అనేక సమస్యలు ఈసారి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించబోతున్నాయి.