కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పండి..సునీత గెలుపు బాధ్యత మదన్ రెడ్డిదే

  • Publish Date - October 29, 2023 / 04:40 PM IST

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయం దండగ అన్న కాంగ్రెస్ కు, సిలిండర్ రేటు పెంచి మహిళలను కన్నీళ్లు పెట్టించిన బీజేపీలకు బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బీఆరెస్ ఎన్నికల శంఖారావం సభ నిర్వహించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, వచ్చే ఎన్నికలో పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా రెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదేనని… ఎంపీగా మదన్ రెడ్డిని గెలిపించే బాధ్యత తమదని హరీష్ రావు పేర్కొన్నారు.


కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పిన మాటలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సమాధి చేసుకుందని అన్నారు. నిజాలు చెప్పిన అతనికి థాంక్స్ చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ కు11 సార్లు చాన్స్ ఇచ్చినా తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 11 సార్లు రైతుబంధు ఇచ్చి రైతులను ఆదుకుందన్నారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.


కాంగ్రెస్ కు మరోసారి చాన్స్ ఇవ్వడం అంటే మనలను బొంద పెట్టడానికే అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నర్సాపూర్ అభివృద్ధి కోసం కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రెడ్డిని భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రా గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.