ఓటుకు వేళాయే… నేడే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వాహణకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధమయ్యారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రీని తీసుకుని బుధవారం సాయంత్రం కల్లా చేరుకున్నారు

  • Publish Date - November 29, 2023 / 03:32 PM IST
  • పోలింగ్ కేంద్రాలకు చేరిన సామాగ్రీ…సిబ్బంది

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వాహణకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధమయ్యారు. నేడు గురువారం జరిగే పోలింగ్ నిర్వాహణకు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రీని తీసుకుని బుధవారం సాయంత్రం కల్లా చేరుకున్నారు. పోలింగ్ ప్రారంభానికి 90నిమిషాల ముందు ఉదయం 5.30కు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాతా బ్యాలెట్ యూనిట్‌, వీవీ ప్యాట్‌ల ట్రేను పూర్తిగా క్లియర్ చేసి పోలింగ్‌కు సిద్దం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 119నియోజకవర్గాల్లో పోలింగ్ నేడు గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగనుంది. అయితే సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్‌, మంధని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం, నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరుగనుంది.


రాష్ట్ర వ్యాప్తంగా 35,655పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 27,094 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలీంగ్ ప్రక్రియ నిర్వాహణకు 22వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్‌లను నియమించారు. 1.85లక్షల మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల బందోబస్తులో 45వేల రాష్ట్ర పోలీసులు, 23,500 పొరుగు రాష్ట్ర పోలీసులు, 375కేంద్ర కంపనీ బలగాలు, 50కంపనీల తెలంగాణ స్పెషల్ పోలీసు బలగాలు, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్టు శాఖకు చెందిన 3వేల మంది పనిచేయనున్నారు.


మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ఏరియాల్లోని, సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 3కోట్ల 26,0277మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటిదాకా 1.48లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోగా, ఇంటి నుంచి 27,178మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను నిర్ధేశించిన 49కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.