పోలింగ్ ప్రశాంతం…64 శాతం నమోదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 64 శాతం పోలింగ్ నమోదైంది. చెదురు మదరు సంఘనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది

  • Publish Date - November 30, 2023 / 01:20 PM IST
  • చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతం
  • గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఓటింగ్‌
  • పోలింగ్ సమయం ముగిశాక భారీగా క్యూలైన్లు
  • మారని హైద్రాబాద్ ఓటింగ్ తీరు
  • పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
  • ఈవీఎంలలో నిక్షిప్తమైన 2,990మంది అభ్యర్థుల భవితవ్యం
  • 3న ఓట్ల లెక్కింపు

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 64 శాతం పోలింగ్ నమోదైంది. చెదురు మదరు సంఘనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఉదయం నుంచే మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 1గంటకు 36.68శాతం మాత్రమే నమోదైంది. అప్పటిదాకా మెదక్ జిల్లాలో మాత్రం అత్యధికంగా 50.80శాతం, హైద్రాబాద్‌లో అత్యల్పంగా 20.79శాతం పోలింగ్ నమోదైంది. అయితే మధ్యాహ్నం తర్వాతా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఓటింగ్ శాతం పెరుగుతూ 3గంటలకు 57.89శాతంకు, సాయంత్రం 5గంటల కల్లా 63.94 శాతంకు చేరుకుంది. ఇంకా పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. గత ఎన్నికల్లో 73.74 శాతం పోలింగ్ నమోదైంది. అంతకంటే ఈ దఫా తక్కువే పోలింగ్ నమోదయ్యే పరిస్థితి నెలకొంది. గురువారం 35,655పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ లో సాయంత్రం 5గంటలకల్లా అత్యధికంగా మెదక్‌లో 80.28శాతం, అత్యల్పంగా హైద్రాబాద్‌లో 39.97శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. అక్కడక్కడ తొలి గంటలో ఈవీఎంల మొరాయింపు, పార్టీల వారిగా స్వల్ప ఘర్షణలు వంటి చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.


హైద్రాబాద్, పలు పట్టణాల్లో ఉన్న ఓటర్లు తమ నియోజకవర్గాల్లో ఓటేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్లడంతో ప్రధాన రహదారులు వాహనాల రద్దీతో కిటకిటలాడాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. మావోయిస్టు ప్రభావిత 13ఏజెన్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4గంటలకే ముగించారు. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్‌, మంధని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలంలలో పోలింగ్‌కు 4గంటలకే ముగిసింది. మిగతా 106నియోజకవర్గాల్లో 5గంటలకు ముగిసిపోగా అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు. తెలంగాణ వ్యాప్తంగా 119నియోజకవర్గాల్లో 2,990మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారి భవితవ్యం ప్రస్తుతం ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్‌లకు చేరింది. డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపుతో విజేతలెవరో..రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం దక్కనుందో తేలనుంది.

మొరాయించిన ఈవీఎంలు

ఉదయం పోలింగ్ ప్రారంభమైన క్రమమంలో సూర్యాపేట బూత్ 89, బాసరలో 262బూత్‌, లక్సెట్టిపేటలో 83వ బూత్‌, కరీంనగర్‌లో 371వ బూత్‌, మెదక్ జిల్లా ఎల్లాపూర్ బూత్‌లో ఈవీఎంలు తొలుత మొరాయించగా అధికారులు వెంటనే లోపాలను సరిదిద్ది పోలింగ్ కొనసాగేలా చూశారు. సంగారెడ్డి పోటుపల్లిలో, నారాయణ్‌ఖేడ్ హంగుర్గా గ్రామంలో ఈవీఎంలు మొరాయించాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో 140వ పోలింగ్ బూత్‌లో మొదటి ఈవీఎం మొరాయించగా, రెండో ఈవీఎం ఏర్పాటు చేసిన అది కూడా పనిచేయక మూడో ఈవీఎంతో పోలింగ్ కొనసాగించగా, 12గంటలకు పూర్తి స్థాయిలో పోలింగ్ కొనసాగింది.

పలుచోట్ల స్వల్ప ఘర్షణలు..లాఠీచార్జీ

నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం బిట్ల తండాలో బీఆరెస్ అభ్యర్థ సునితాలక్ష్మారెడ్డి కుమారుడు శశిధర్‌రెడ్డిపై తండావాసులు రాళ్ల దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఖానాపూర్‌లో బీఆరెస్‌, కాంగ్రెస్ వర్గాల మధ్య, జనగామ 245పోలింగ్ కేంద్రం వద్ధ కాంగ్రెస్‌, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడగా పోలీసులు చెదరగొట్టారు. ఆలేరు మండలం కొలనుపాకలో బీఆరెస్ అభ్యర్థి ఎమ్మెల్యే గొంగిడి సునిత భర్త గొంగిడి మహేందర్‌రెడ్డిపై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేయడంతో పోలీసులను ఇరువర్గాలను చెదరగొట్టారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బీఆరెస్ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి పారీ్ కండువాతో బూత్‌లోకి వెలుతుండగా ఆపిన సీఐపై చిందులేశారు. మంచిర్యాల చెన్నూర్‌లో 163వ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కుమారుడు ఏజెంట్ పాస్‌తో బూత్‌లోకి వెళ్లడాన్ని ప్రశ్నిస్తూ బీఆరెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కొడంగల్‌ మైలారం పోలింగ్ స్టేషన్‌కు బీఆరెస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి వచ్చిన సందర్భంలో కాంగ్రెస్‌, బీఆరెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా అక్కడ కూడా పోలీసులకు లాఠీలకు పనిచెప్పారు. పాతబస్తీలో ఎంబీటీ అభ్యర్థి ఖలీద్‌ఖాన్‌, ఎంఐఎం నేత యాసిర్‌ఖాన్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. భూపాలపల్లి బీఆరెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డివర్గీయులకు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట సాగింది. సిర్పూర్‌లో బీఎస్పీ కార్యకర్తలపై బీఆరెస్ అభ్యర్థి కోనేరు కోనప్ప అనుచరులు పాత సర్సాల గ్రామంలో దాడికి పాల్పడ్డారు.

డబ్బులు చేతికొచ్చాకే ఓటింగ్‌కు

రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఓటర్లు అభ్యర్థుల నుంచి తమ చేతికి డబ్బుఅందాకే ఓటేసేందుకు ఆసక్తి చూపడంతో పలు గ్రామాల్లో ఓటింగ్ ఆలస్యంగా ఊపందుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ తండా వాసులు తమకు డబ్బులివ్వలేదంటూ పోలింగ్‌కు దూరంగా ఉండి, డబ్బులు అందాకా పోలింగ్‌ ముగింపు సమయం దగ్గర పడుతుండగా ఒక్కసారిగా ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కొత్తగూడెం మున్సిపాల్టీ వార్డులో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ స్థానికులు వాగ్వావాదానికి దిగారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంనియోజకవర్గం 40వ డివిజన్‌లో కార్పోరేటర్ పోశాల పద్మ ఇంటిని స్థానికులు ముట్టడించడంతో కొంత ఉద్రిక్తత ఏర్డింది. జనగామా జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో వలస ఓటర్లకు ఓటేసేందుకు ఖర్చులు ఇస్తామని చెప్పి వచ్చాకా ముఖం చాటేసిన నాయకుడు వచ్చేదాకా వారి ఓట్లు వేయలేదు. భద్రాచలం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహిళలు తమకు డబ్బులిస్తామని ఇవ్వలేదంటూ ధర్నాకు దిగారు.

పోలింగ్‌లో అపశృతి..

పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామం 248పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న సుధాకర్ పోలింగ్ ముందు రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాల్టీలో డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు వాగ్వివాదానికి దిగారు. అదిలాబాద్ పట్టణంలో ఓటు వేసేందుకు వచ్చిన మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ(78) ఫిట్స్‌తో, భూక్తాపూర్‌కు చెందిన రాజన్న(65) కళ్లు తిరిగి క్యూలైన్‌లో పడిపోగా వారిని రిమ్స్‌కు తరలించినప్పటికి అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు. మోత్కూర్ మండలం దాచారం గ్రామం పోలింగ్ కేంద్రంలో తేనే టీగలు దాడి చేయడంతో క్యూలైన్లలో ఓటర్లు పరుగులు తీశారు. అయితే పరుగెత్తలేని ఓ వృద్ధురాలు సూరారం బాలనర్సమ్మ తేనేటీగల దాడిలో తీవ్రంగా గాయపడింది.

నేతలపై ఫిర్యాదులు

ఎమ్మెల్సీ కవిత ఓటు వేసి బయటకు వచ్చాకా బీఆరెస్ ఓటు వేయాలని చెప్పడంతో కాంగ్రెస్ ఆమెపై కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు చేసింది. అటు రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై కూడా ఈసీకి కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు అందింది. ఎల్లపల్లి పోలింగ్ బూత్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ కండువా కప్పుకుని వెళ్లడంతో కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఓటేసిన ప్రముఖులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చింత మడకలో తన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ తన సతీమణి శైలిమతో కలిసి బంజారాహిల్స్ నందగిరి హిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రామ్‌నగర్‌లోని వీజే హైస్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ కమలాపూర్‌లో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సూర్యాపేటలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాదర్‌ఘట్‌లోని అజంపురాలోని కిడ్జి స్కూల్ పోలింగ్ కేంద్రంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఓటు వేశారు. హైద్రాబాద్‌లో హీరోలు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, జూనియర్ ఎన్టీఆర్‌, మహేశ్ బాము, సాయి ధరమ్ తేజా, దేవరకొండ, నితిన్‌, రామ్‌, నానీ, విశ్వక్ సేన్‌, జగపతిబాబు, నరేశ్‌, నిర్మాత అల్లు అరవింద్‌, సీపీ సీవి ఆనంద్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.