21న తెలంగాణ కేబినేట్ సమావేశం

మే 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక పథకాలు, భూముల మార్కెట్ విలువలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. రాష్ట్ర అవతరణ జూన్ 2వ తేదీకి ముందు జరుగబోతున్న ఈ కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే పలు కొత్త నిర్ణయాలు, పథకాలపై చర్చించి ఆమోదం తెలుపవచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల బీమా, కొత్త ఆసరా పింఛన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపైన పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ‌పైనే కేబినెట్ చ‌ర్చించనున్న‌ట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంపు ప్రతిపాదనలపై ఇప్పటికే నివేదిక సిద్దం చేయడంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 28 నుంచి కొత్త మార్కెట్‌ విలువల ప్రకారం స్టాంప్‌ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖ ఏర్పాట్లు చేసిన‌ట్లు స‌మాచారం. భూముల విలువల పెంపు ద్వారా ఈ ఏడాది అదనంగా రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెండింగ్ లో ఉన్న రైతు భరోసా మూడో వాయిదా నిధుల విడుదలపైన, ధాన్యం కొనుగోలు సమస్యలపైన, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపైన చర్చించవచ్చని భావిస్తున్నారు. అలాగే ఉద్యోగుల డిమాండ్లు, ఆర్టీసీ సమ్మె హామీల అమలు సహా మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వంటి పథకాలపై చర్చిస్తారని సమాచారం. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, అకడమిక్ క్యాలెండర్, పంటల మార్పిడి విధానం, ఫీజుల నియంత్రణ అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది.

మరోసారి వాయిదా పడిన కేఆర్ఎంబీ సమావేశం

ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నేఫధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటాలు, ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ప్రతిపాదించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) 21వ సమావేశం మరోసారి వాయిదా పడింది వాస్తవానికి 21వ బోర్డు సమావేశాన్ని మొదట ఈ నెల 14న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అదే రోజున ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో, భేటీని ఈ నెల 21కి వాయిదా వేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశాన్ని మరోసారి వాయిదా వేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కృష్ణా బోర్డు.. 21న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. సమావేశానికి సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులకు అధికారికంగా చేరవేసింది.

ఇవి కూడా చదవండి :

తీరని మంత్రి సీతక్క చదువుల దాహం
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చు : స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

Latest News