విధాత .ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎదురైన కష్టాలే మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించాయని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం వచ్చేదాక సమైక్య పాలకుల పాలనతో రైతులు ధర్నా చేయని రోజూ లేదు అని, మళ్ళీ 12 ఎండ్ల తర్వాత అదే పరిస్థితి నెలకొందని అన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ నల్గొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహా ధర్నాలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన పాపం.. రేవంత్ సర్కార్ చేసిన శాపంతో రైతులు మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారన్నారు.
2013లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే..కేసీఆర్ హయాంలో 2023లో 40లక్షలకు పెరిగిందని, అప్పట్లో మోదీ కొనుగోలు చేయనంటే.. ఏకంగా ఢిల్లీలో ధర్నా చేసిన ఘనత కేసీఆర్ దే అని జగదీశ్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో.. తడిసిన ధాన్యం సైతం కొనిపించారు అని, కరోనా సమయంలో.. కల్లాల దగ్గరే కొన్నారని గుర్తు చేశారు.
మిల్లర్లతో కుమ్మక్కైన మంత్రులు
తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన చేస్తూ రైతులను ధాన్యం కొనకుండా, డబ్బులు చెల్లించకుండా ఏడిపిస్తున్నాడని జగదీశ్ రెడ్డి విమర్శించారు. నెల రోజులైన ధాన్యం కొనలేని దుస్థితి ఏర్పడిందని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ సర్కార్ ను చెప్పుతో కొట్టాలి అని అన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులు తిప్పలు పడుతుంటే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు.. కనీసం రివ్యూ చేసే తీరికలేదు అని మండిపడ్డారు. హెలికాప్టర్ లు లేనిదే కాలు మంత్రి కాలు కదపడం లేదు అన్నారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటుంటే పట్టడం లేదు అని, క్వింటాలకు 10 కిలోలు కట్ చేస్తున్నా.. మంత్రులు అడ్రెస్స్ లేకుండా పోయారన్నారు. మంత్రులకు తెలిసే మిలర్ల దోపిడి పర్వం కొనసాగుతుందని, వారి నుంచి కమిషన్ల దొబ్బడానికే మంత్రులున్నారు అని ఆరోపించారు. జిల్లా మంత్రులకు దోచుకోవాలి.. దాచుకోవాలి అన్న ద్యాసనే ఉందన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి.. దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్నది హైబ్రిడ్ కాంగ్రెస్
ప్రధాని మోదీ, చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. చాలా మంది ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు అని, మా పార్టీలోకి వస్తామంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు హైబ్రిడ్ కాంగ్రెస్ అని అన్నారు. అప్పట్లో కేసీఆర్ నల్లగొండ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు అని, ప్రత్యేక విజన్ తో.. జిల్లాను అభివృద్ధి చేసారు అని చెప్పుకొచ్చారు. ఫ్లోరైడ్ భూతం బారిన పడిన నల్గొండ నుంచి కేసీఆర్ మిషన్ భగీరధ పథకం చేపట్టి ఫ్లోరైడ్ ను తరిమేశారని గుర్తు చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా లో రోజుకు 500 కిలోమీటర్లు కారులో తిరిగే వాడిని… రోజు మూడు రివ్యూలు చేస్తూ ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టేవారిమని…ఇప్పుడు ఒక్క మంత్రి కూడా కనపడటం లేదు అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
మహాధర్నాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన బాధ్యత : మంత్రి పొంగులేటి
కేబీఆర్ పార్కు పరిసరాల చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
