సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లా పర్యటనకు హాజరుకాబోతున్నారు. పర్యటనలో భాగంగా రూ.13వేల కోట్లతో నిర్మించే హ్యామ్ రోడ్ల పనులకు ఆర్ఆండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి కనగల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి నల్లగొండ పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జీ కంచర్ల భూపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల తరుపునా ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో బీఆర్ఎస్ హాయంలో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చేసిన పనులను ప్రస్తావిస్తూ..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన అభివృద్ధి పనులను, జరుగాల్సిన అభివృద్ది కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తూ ప్రశ్నించారు.
మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం అభివృద్దికి వేల కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేశారని, ఇందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని కంచర్ల గుర్తు చేశారు. అయితే ఇవన్నీ నల్లగొండ ప్రజల అవసరాలకు అనుగుణమైన పనులు కావడంతో పాటు నల్లగొండ రూపు రేఖలు మార్చే పథకాలేనని, రెండున్నర ఏండ్ల కాలంలో ఇక్కడి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీటి వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని మండిపడ్డారు. కేవలం జిల్లా మంత్రి వెంకట్ రెడ్డి కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇస్తూ నిజమైన ప్రజల అవసరాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. నిత్యం పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ నిజమైన నల్లగొండ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు నేటికీ ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, ఉదయసముద్రం ప్రాజెక్టు లాంటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండకు వస్తున్న సందర్బంగా ఇక్కడి మంత్రి వ్యవహారశైలి, ప్రజల సమస్యలు, పెండింగ్ పనులు, తదితర అంశాలపై దృష్టి పెట్టి స్పందించాలని డిమాండ్ చేశారు.
