కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అన్యాయం : మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత జి.జగదీష్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం వచ్చిందన్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అన్యాయం : మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి

విధాత : రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతుందని, రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి విమర్శించారు. దేవరకొండ లో జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు 400 కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తోందని, అది కుడా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పని చేస్తున్నదని జగదీష్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు ఓ స్వర్ణయుగం..ఏ విషయంలో కూడా అన్నదాతలు ఇబ్బందులు పడలేదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతాంగం వ్యవసాయం చేయడంలో ఇబ్బంది పడుతుందని ఆరోపించారు. రైతు బంధును మూడు సార్లు ఎగ్గొట్టిన మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. సాగు నీళ్లు ఇవ్వకుండా, యూరియా లేక కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ పంటలను ఎండబెడుతుందని విమర్శించారు.

రైతు భరోసా ఇవ్వడానికి చేతులు రాని సీఎం రేవంత్ రెడ్డి.. వారి నాయకుడు రాహుల్ గాంధీకి, కేరళ ఎన్నికలకు మాత్రం వందల కోట్లు తెలంగాణ సొమ్మును తరలిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎంగా మారింది అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు ఉన్నా..శుద్ధ దండగ అని, హెలికాఫ్టర్లలో తిరగడం తప్ప రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ది ఏమీ లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్ కింద, ఎస్ ఎల్బీసీ కింద నీళ్లు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. రైతులకు నీళ్లివ్వడంలో చేవ లేని, సత్తా లేని మంత్రులతో జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు. డిండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా నల్గొండకి నీళ్లు రాకుండా పెద్ద కుట్ర జరుగుతోంది అని ఆరోపించారు. అయినప్పటికి ఇద్దరు జిల్లా మంత్రులు చేతకాని వారిలాగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో అసమర్థ కాంగ్రెస్ మంత్రుల భరతం పడతాం అని, వారి చేతకాని తనాన్ని నిలదీస్తాం అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

IPL 2026 ఇప్పట్లో లేనట్లేనా..?
Gold Price | పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి