మరో పేపర్ లీక్..మహారాష్ట్ర ‘టెట్‌’ పరీక్ష వాయిదా

మహారాష్ట్రలో టీచర్స్ టెట్-2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేశారు. 1,028 కేంద్రాల్లో జరగాల్సిన పరీక్షను రద్దు చేసి, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 27, 2026, 4:43 pm IST
Read Time: 2 mins
మరో పేపర్ లీక్..మహారాష్ట్ర ‘టెట్‌’ పరీక్ష వాయిదా

నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం, రీఎగ్జామ్ నిర్వాహణ మరువకముందే.. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఆదివారం జరగాల్సిన టీచర్స్‌ టెట్‌ పరీక్ష పేపర్‌ లీక్ సంచలనం రేపింది. పరీక్షకు 24 గంటల ముందే పేపరు బయట కనిపించడంతో పేపర్ లీకయినట్లు పోలీసులు గుర్తించారు.

పేపర్ లీక్ ను ధృవీకరించుకున్న విద్యాశాఖ అధికారులు టెట్ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,028 కేంద్రాల్లో జూన్ 28న నిర్వహించాల్సిన TET 2026 పరీక్షను పారదర్శకత విశ్వసనీయతను కాపాడే ఉద్దేశంతో వాయిదావేసినట్లు విద్యా మండలి పేర్కొంది. భివండీ పోలీస్‌స్టేషన్‌లో టెట్ పరీక్ష పేపర్ లీక్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పేపర్ లీక్ అంశంపై విచారణ కొనసాగుతుంది.

అయితే కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో పరీక్ష పేపర్ల లీక్ లు సాధారణమైపోయాయంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మరోసారి విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా పేపర్ల లీక్ లు, పరీక్షల నిర్వహణలో అవతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటం విశేషం.