తీరం మనదే.. బోటు మనదే.. వేట మనదే, రాజీ లేదు, ఎవరైనా వస్తే వెంటాడుతాం.. లేదా వేటాడుతాం. అంతే కానీ ఇక్కడికి రానివ్వం అని, తీరంపై మన హక్కులను కాపాడుకోవడంలో, జీవనోపాధి పరిరక్షణలో ప్రభుత్వం పూర్తి నిఘా పెడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాతుమ్మలపెంట మత్స్యకారుల సేవ సభలో చంద్రబాబు మాట్లాడారు. మన తీరప్రాంతానికి పొరుగు రాష్ట్రం వారు ఎవరు వచ్చినా సహించేది లేదు. మత్స్యకారుల హక్కులు కాపాడతాం..మన తీరప్రాంతంలో నిఘాపెట్టి పొరుగు రాష్ట్రాల బోట్లు రాకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. సముద్రంలో చేపల వేట అంటే సాహసంతో కూడిన పని, జీవనోపాధి కోసం రోజుల తరబడి సముద్రంలో గడుపుతారు అని, ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేట నిషేధ సమయం అని గుర్తు చేశారు. ఈ సమయంలో మత్స్యకారులకు అండగా ఉండాలనే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తోందని,మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలనే మత్స్యకారుల సేవలో పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నామని తెలిపారు.
‘మత్స్యకార భరోసా’ కింద రూ.260 కోట్లు విడుదల
ఏటా 61 రోజుల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు ‘మత్స్యకార భరోసా’ కింద మొత్తం 1,30,796 మత్స్యకారుల కుటుంబాలకు రూ.260 కోట్లు విడుదల చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ వారిని ఆదుకుంటున్నాం అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశాం అని, మళ్లీ కూటమి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 వేలకు ఆర్ధిక సాయాన్ని పెంచి ఇస్తున్నాం అని తెలిపారు. సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్యకారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారని, అయితే 2019-24 మధ్యలో చేపల ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని వెల్లడించారు. వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత మత్స్యసంపదపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు అని, దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు.
మత్స్యకారులకు ఆధునిక బోట్ లు
మత్స్యకారులకు అండగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ డీజిల్ పడవలకు రూ.9 మేర డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం అని, 2026-27లో రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సీడిని మత్స్యకార బోట్లకు అందించామని చంద్రబాబు తెలిపారు. రూ.3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, మత్స్యకారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పడవలు, వలలు, పరిహారం సకాలంలోనే ప్రభుత్వం అందిస్తోందన్నారు. 200 మెకనైజ్డ్ బోట్లను మన మత్స్యకారుల కోసం శాంక్షన్ చేస్తామని హామీ ఇస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. 60 శాతం సబ్సీడీ ఇవ్వటంతో పాటు మిగిలిన మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తాం అన్నారు. మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేసేలరూ.288 కోట్లతో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలిపారు. దీనిపై కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తాం అని, సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చంద్రబాబు చెప్పారు. మత్స్యకార మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు సముద్రపు నాచు పెంపకం ద్వారా అదనపు ఆదాయం సాధించేలా చేస్తాం అన్నారు. నదులు, సముద్ర తీరప్రాంతాల్లోనే నాగరికతలు వెలసిల్లాయి. మన రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉందని, సముద్ర తీరప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలకు ప్రాధాన్యతనిస్తున్నట్లుగా తెలిపారు. చేపలు మంచి పౌష్టికాహారం. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రోటీన్ ఉన్న ఈ ఆహారానికి అన్నిచోట్లా గిరాకీ ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు పండించే చేపలకు గిరాకీ సృష్టించేలా మార్కెటింగ్ మేనేజర్ గా నేను వ్యవహరిస్తానని, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి వస్తుందని, . మత్స్యకారులు కూడా ఈ అభివృద్ధి అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తాం అన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి. అక్కడ చేపల పెంపకం చేపట్టాలని తెలిపారు.
ఆక్వా కల్చర్ కు అభివృద్ధికి ప్రోత్సాహాకాలు
ఈ ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతోందని, కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు అని, దీని ద్వారా స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చేపలు ఎక్కడ లభ్యం అవుతుందో కూడా సమాచారం ఇస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. మెకనైజ్డ్ బోట్ల ద్వారా చేపలను సులువుగా వేట చేసేలా ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆక్వా కల్చర్ కు అభివృద్ధి కోసం ఒక్కో యూనిట్ కు రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం, మన రాష్ట్రానికి ఏ రంగంలో ఆదాయం వస్తుందో దానిపై శ్రద్ధ పెట్టి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వివరించారు. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు అని విమర్శించారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరి చేయడానికి 23 నెలల సమయం పట్టింది. రాష్ట్రం పునర్నిర్మాణం చేస్తున్నాం అన్నారు.
రూ.23లక్షల పెట్టుబడులు..24లక్షల ఉద్యోగాలు
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటంతో పాటు విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా ఏపీని అభివృద్ధి చేస్తున్నామని, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 24 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి అని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో డిఫెన్సు, డ్రోన్స్, స్పేస్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ 18 నెలల్లో తిరుపతి వద్ద బుల్లెట్ మోటారు సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది అని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి :
హైకోర్టు జడ్జిపై అసత్య ప్రచారాల విచారణకు మరో సిట్
పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెంచండి: సీఎం రేవంత్ రెడ్డి
