Cotton Procurement : తెలంగాణలో పత్తి కొనుగోళ్ళు బంద్

తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. సీసీఐ స్పందించకపోవడంతో ట్రేడర్లు బంద్ కొనసాగించగా, విషయం కేబినెట్‌లో చర్చకు రానుంది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ళు నిలిచిపోయాయి. పత్తిని అమ్ముకునేందుకు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రైవేటు ట్రేడర్లు పత్తి కొనుగోళ్ళను సోమవారం నుంచి బంద్ పెట్టారు. దీంతో పత్తిని పండించి అమ్ముకునేందుకు అవకాశం లేకపోవడంతో డబ్బులు అత్యవసరమైన రైతులు తక్కువ ధరకు దళారులకు పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతుల గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వాల మాటలకు చేతలకు పొంతనలేని పరిస్థితి నెలకొంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి కాటన్ అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సమస్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్రం దృష్టికి తెచ్చినప్పటికీ సీసీఐ నుంచి గానీ, కేంద్రం నుంచి గానీ సానుకూల స్పందన రాకపోవడంతో మిల్లర్లు కొనుగోళ్ళు నిలిపివేశారు. పరోక్షంగా ఇదంతా పత్తి రైతులతో చెలగాటమాడడమేనని అంటున్నారు. సోమవారం జరిగే రాష్ట్ర కేబినేట్ సమావేశంలో ఈ సమస్య చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమంటున్నారు.

తెలంగాణ సర్కారు స్పందన పై ఆసక్తి

దీనిపై రాష్ట్రం ఏ విధంగా స్పందిస్తుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ సమస్య అసోసియేసన్ ఒక సారి కొనుగోళ్ళ బందుకు పిలుపునివ్వగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల జోక్యంతో అసోసియేషన్ నిరసనను విరమించుకుంది. అయినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో మరోసారి అసోసియేషన్ సోమవారం నుంచి కొనుగోళ్ళ బందు చేయడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారనే చర్చ సాగుతోంది. కొనుగోళ్ళ బంద్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఆందోళనలో ఉన్నారు.