విధాత, హైదరాబాద్ :
స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా శుక్రవారం 32 మంది ఐపీఎస్ లను బదీలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్ర పరిపాలన విభాగంలో కీలక మార్పులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత కొన్నిరోజులుగా ఐపీఎస్ ల పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఈసారి ఐఏఎస్ (IAS Transfer) అధికారులను బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు పలు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కల్పించనున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్ల లిస్టులో నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీలపై ఏ క్షణమైనా ఉత్తర్వులు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నివేదిక తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నిర్వహణకు సిద్ధమవుతోంది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ముందే పరిపాలన అధికారులను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమచారం.
