(విధాత, హైదరాబాద్)
తెలంగాణలో వ్యవసాయానికి సమగ్ర విధానం, ఆలోచనా క్రమం లేదని, తాత్కాలిక నిర్ణయాలే ప్రభుత్వ విధానంగా పదేళ్లుగా కొనసాగిందని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం రూపంలో లక్షల మంది రైతుల చేతిలోకి కొంత నగదు వెళ్తున్నా, వ్యవసాయం చేయని పట్టాదారులకు కూడా ఏటా వేల కోట్ల రూపాయలు వెళ్తూ దుబారా అవుతున్నదని తెలిపారు. ‘రాష్ట్రంలో కౌలు రైతు కుటుంబాలు 36 శాతం (22 లక్షలు) ఉన్నాయి. వారికి ఎటువంటి సహాయం అందట్లేదు. పట్టాదారులకు మాత్రమే మేలు చేస్తాం అన్న ప్రభుత్వ వైఖరి పూర్తి అన్యాయం. మెజారిటీ సన్న, చిన్న కారు, కౌలు రైతులు నష్ట పోతున్నారు’ అని తెలిపింది. రైతు బంధు ముసుగులో రైతు మద్దతు వ్యవస్థలను ప్రభుత్వం చాలావరకు నిర్వీర్యం చేసిందని రైతు స్వరాజ్య వేదిక ఆరోపించింది. అనేక సీజన్లలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోగా, అసలు నష్టాన్ని అంచనా వేసే వ్యవస్థను కూడా మూలన పడేసిందని, దీనిపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేసింది.
పంట బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
2020 వానకాలం నుంచి పంటల బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణేనని రైతు స్వరాజ్య వేదిక తెలిపింది. ‘రైతులకు విత్తన కార్పొరేషన్ ద్వారా విత్తనాల సరఫరా, ఇతర సబ్సిడీ పథకాలు పూర్తిగా ఆగిపోయాయి లేదా తగ్గిపోయాయి. 2014, 2018లో ఇచ్చిన రుణ మాఫీ హామీ సరిగా అమలు కాలేదు. ఫలితంగా రైతులపై మరింత వడ్డీ భారం పెరిగింది’ అని పేర్కొన్నది. మొత్తం సంస్థాగత రుణ వ్యవస్థ కుప్పకూలి పోయిందని, రైతులు ప్రైవేట్ రుణాల ఊబిలో కూరుకుపోయారని పేర్కొన్నది. గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను కూడా పూర్తిగా బలహీన పరచడం, సమగ్ర భూ సర్వే లేకుండా ధరణి వ్యవస్థ తేవడంతో భూ సమస్యలు మరింత జటిలమయ్యాయని తెలిపింది.
‘పంటల సరళిలోనూ స్పష్టమైన వైఖరి లేదు. ఓ ఏడాది పత్తి విస్తీర్ణం తగ్గించాలని, మళ్ళీ 70 లక్షల ఎకరాలకి పెంచాలని టార్గెట్ ఇవ్వడం, వరి విస్తీర్ణం విపరీతంగా పెంచడం, ఆ తర్వాత యాసంగిలో వరి వేయకూడదని చెప్పడం వంటి నిర్ణయాలతో రాష్ట్రంలో పంటల వ్యవస్థలోని సమస్యలను తీర్చడం కాకుండా మరింత పెంచాయి’ అని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు వైఖరితో రైతుల ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాకుండానే పదేళ్ళు గడిచిపోయాయని పేర్కొన్నది. వ్యవసాయ కుటుంబాలు ఇప్పటికీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయని తెలిపింది.
‘సంక్షోభానికి సూచికగా గత తొమ్మిదేళ్లలో 7000 కు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయంటే, ఈ రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని అర్థం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. దానికి అవసరమైన చర్యలను తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచాలి’ అని డిమాండ్ చేసింది. ఈ దృష్టితో రైతు స్వరాజ్య వేదిక ప్రతిపాదనలు, డిమాండ్లు పొందుపరిచింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాలను తమ మేనిఫెస్టోలో చేర్చాలని గట్టిగా కోరింది.
ప్రధాన ప్రతిపాదనలు.. డిమాండ్లు
కౌలు రైతులను గుర్తించేందుకు 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలి. గుర్తింపు కార్డులు అందించాలి. పంట రుణాలు, నష్ట పరిహారం, బీమా, పెట్టుబడి సహాయ పథకాలు, రైతు బీమా, పంటల కొనుగోలు వ్యవస్థ కౌలు రైతులకు వర్తింప చేయాలి. రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని సాగు భూమికే ఇస్తూ, 10 ఎకరాలకే పరిమితం చేయాలి. కౌలు రైతులు, ఆదివాసీ పోడు రైతులు, మహిళా రైతులు, దేవాదాయ భూములు సాగు చేసే కౌలు రైతులు సహా వాస్తవ సాగుదారులందరికీ పెట్టుబడి సహాయం ఇవ్వాలి. గత సంవత్సరాలలో కొంతమందికి సహాయం అందలేదు. పీఎం కిసాన్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వీటిని సమీక్షించి ఆ రైతులకు బకాయిలు తిరిగి చెల్లించాలి. రాష్ట్రస్థాయిలో మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలి.
కేవలం వరి ధాన్యం సేకరణకే పరిమితం కాకుండా, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలను కూడా తప్పకుండా సేకరించాలి. మండలానికి కనీసం ఒక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి. పంటల సాగు, పశు పోషణ ఆధారిత కాలుష్య రహిత పరిశ్రమలను నెలకొల్పాలి. వ్యవసాయ కుటుంబాల ఆదాయ భద్రత కోసం కమిషన్ ఏర్పాటు, రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టాన్ని తీసుకురావాలి. వాస్తవ సాగుదారులకే వ్యవసాయ రుణాలు అందించాలి. రుణ పరిమితిని కనీసం 1. 6 లక్షలకు పెంచాలి. రుణ మాఫీ వర్తించిన రైతులకు, ప్రభుత్వం సకాలంలో రుణ మాఫీ చేయని కారణంగా పేరుకుపోయిన వడ్డీలను కూడా చెల్లించి వారిని పూర్తిగా రుణ విముక్తులను చేయాలి. ఎకరానికి 10 వేల రూపాయలు విపత్తు సహాయాన్ని కౌలు రైతులతో సహా నష్టపోయిన సాగుదారులందరికీ అందించాలి.
పటిష్టమైన పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి
కాళేశ్వరం, పోలవరం వంటి ప్రాజెక్ట్ బాక్ వాటర్ కింద ముంపుకి గురవుతున్న పంట పొలాలకు ముంపు జరిగిన వెంటనే, ఎకరానికి 20 వేలు నష్ట పరిహారం వాస్తవ సాగుదారులకు అందించాలి. రెవెన్యూ భూముల సమగ్ర సర్వే జరిపి, భూ రికార్డులను పూర్తిగా సరి చేయాలి. వివిధ సర్వే నంబర్లలో భూ విస్తీర్ణం తేల్చడానికి, భూమి హక్కుదారులను గుర్తించడానికి, భూ వివాదాల పరిష్కారానికి, అసైన్డ్ భూముల, సాదా బైనామా సమస్యల పరిష్కారానికి, భూ సంస్కరణలు అమలు చేయడానికి ఈ సమగ్ర సర్వే ను పారదర్శకంగా నిర్వహించడం అత్యవసరం. సమగ్ర సర్వే ఆధారంగా ధరణి సమస్యలను తక్షణం పరిష్కరించాలి. అడవి పై హక్కు ఆదివాసీ ప్రజలదే. అటవీ ఉత్పత్తులకు ఎప్పటికప్పుడు కనీస మద్ధతు ధరలను ప్రకటించాలి.
మహిళా రైతులు, వ్యవసాయ కూలీల హక్కులు
వ్యవసాయంలో సాగుదారులుగా, కూలీలుగా 60-75 శాతం పనులు నిర్వహిస్తున్న గ్రామీణ మహిళలను కూడా రైతులుగా గుర్తించి, వారికి అన్ని పథకాల లబ్ధి అందేట్లు చూడాలి. వారసత్వ చట్టం ప్రకారం భర్త లేదా తండ్రి చనిపోయినప్పుడు కుటుంబానికి చెందిన భూమి, ఆస్తిలో మహిళలకు చట్టపరంగా వాటా లభించే టట్లు, భూమి పట్టాలు వారి పేరు మీద ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి.
రైతు బీమా పధకాన్ని భూమి లేని వ్యవసాయ కూలీలు, కౌలు రైతులతో సహా మొత్తం గ్రామీణ కుటుంబాలకు వర్తింపచేయాలి. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు జీవో 194 ప్రకారం ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. వారి వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి. ఆ కుటుంబాలలో మహిళలు గౌరవంగా బ్రతకగలిగే విధంగా ప్రభుత్వ భూమి పంపిణి కార్యక్రమాలలో, వ్యవసాయ సేవలలో, జీవనోపాధి పధకాలలో అన్ని సామాజిక భద్రతా పధకాలలో ఈ కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పాలనా వ్యవస్థలో మార్పులు
గ్రామ, మండల స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలి. అవినీతి నిరోధక చర్యలు, వ్యవస్థలో పార దర్శకతను పెంచే చర్యలు తీసుకుంటూనే గ్రామ, మండల స్థాయిలోనే రైతుల భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయితీ స్థాయిలో రైతు వేదికలు నిర్మించి, రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన జీవ రసాయనాల తయారీ యూనిట్లు, కంపొస్ట్ తయారీ కేంద్రాలు అభివృద్ధి చేయాలి. గ్రామీణ యువత జీవనోపాధులకు అవసరమైన శిక్షణలు అందించాలి. పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలను గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేయాలి.
ప్రైవేట్ పాల డైరీలు కూడా రైతులకు న్యాయమైన ధరలు చెల్లించేలా ప్రభుత్వం మద్ధతు ధరలను ప్రకటించాలి. స్థానిక సహకార సంఘాలు పశువుల దాణా యూనిట్లు నెలకొల్పు కోవడానికి అవసరమైన సహాయం అందించాలి. గ్రామ స్థాయిలో పశు వైద్య వ్యవస్థను అందుబాటులోకి తేవాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రామీణ ప్రాంత ఉమ్మడి భూములపై గ్రామ పంచాయితీ కి రక్షణ అధికారం ఇస్తూ, ఈ భూములను గొర్రెలు, మేకల పోషణకు అవసరమైన ఉమ్మడి మేత భూములుగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలి.