విధాత: రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి..వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుందని..ప్రజా పాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో భాగంగా 143 ప్రాంతాల్లో 23 గ్రామాల్లో 674 ఎకరాల్లో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ జరుగనుంది. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఏనుగు రామారావు వ్యవసాయ పొలంలో 50 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగును మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలన్నారు. ఆయిల్ పామ్ మొక్కల మధ్య ఆదాయం వచ్చే అంతర పంటలు వేసుకోవచ్చన్నారు.
రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని..ఆయిల్ పామ్ సాగుపై మా దగ్గరకు రైతులు రండి.. అవగాహన పెంచుకోండి అని సూచించారు. వర్షాలు లేకున్నా,ఎండలు ఎక్కువగా ఉన్న ఆయిల్ పామ్ పంటలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఒక ఎకరం వరి పొలానికి ఇచ్చే నీరు.. 5 ఎకరాల పామ్ ఆయిల్ సాగు చేయవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ తో మంచి ఆదాయం వస్తుందన్నారు. ఖమ్మం తరువాత అత్యధిక ఆయిల్ పామ్ సాగు సిద్దిపేట జిల్లాలోనే జరుగుతుందన్నారు. ఆగస్టు 15 తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డితో నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించబోతున్నామన్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న వారి తోటకి.. ఫ్యాక్టరీకి ఎంత దూరం ఉందో కిలోమీటర్ ప్రాతిపదికన కిరాయి కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు.
రిఫైన్డ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే పెడతాం..తెలంగాణ మొత్తానికి హుస్నాబాద్ ఆయిల్ పామ్ గుండెకాయ కాబోతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా ఇక్కడికి ఆయిల్ పామ్ తీసుకురావచ్చు అని..దానివల్ల ఉద్యోగాలు కూడా పెరుగుతాయన్నారు. ఆయిల్ పామ్ కటింగ్ పై శిక్షణ ఇవ్వగలిగిన వారికి కలెక్టర్ జీతం కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు. సన్న వడ్ల కి 500 బోనస్ ఇస్తున్నాం.. వరికి ఏ ఇబ్బంది లేదని అనుకుంటాం కానీ రాళ్ళ వర్షం పడగానే పంట మొత్తం దెబ్బతిందని.. ఆయిల్ పామ్ సాగుతో అలాంటి ఇబ్బందులు ఉండవని తుమ్మల వివరించారు. బయట దేశాల నుండి వచ్చే ఆయిల్ మీద సుంకం తగ్గించారని.. దాని వల్ల 2 వేల రూపాయలు మనకి ఆదాయం తగ్గిందన్నారు.
దక్షిణ భారత మంత్రులను తీసుకొని ప్రధాని దగ్గరకు వెళ్తున్నామని..25 వేల రూపాయలు క్వింటాలుకు ఇవ్వండి దేశానికి సరిపడ పామ్ ఆయిల్ ఇస్తాం అని చెబుతామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా భూమి కొనుక్కొని ఆయిల్ పామ్ సాగుచేయాలని మంత్రి తుమ్మల సూచించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ పై మంచి అనుభవం ఉంది.. 30 సంవత్సరాలుగా ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారన్నారు. మా ప్రాంతంలో కూడా ఆయిల్ పామ్ సాగు చేయాలని 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశానని.. వారికి విజ్ఞప్తి చేస్తున్నానని..హుస్నాబాద్ లో ఒక్క గుంట భూమి కూడా వృధాగా ఉండవద్దన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంత రైతులకు నీరు ఇచ్చే బాధ్యత నాది అన్నారు. వైఎస్సార్ శంకుస్థాపన చేసిన తరువాత సొరంగం ఇతర పనులు పూర్తయ్యాయి.. తరువాత కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామన్నారు చేయలేకపోయారన్నారు.
ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఆయిల్ ఫాం,డ్రాగన్ పంటలు వేసి అధిక ఆదాయాన్ని సంపాదించండని రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా హుస్నాబాద్ తయారుకావాలన్నారు. అయిల్ పామ్ కు కోతుల బెడద ఉండదు.. అకాల వర్షాల ఇబ్బందులు ఉండవన్నారు.
కోహెడ మండలంలో 2025- 26 లో 359 ఎకరాల పామ్ ఆయిల్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని..తెలంగాణలో ఇప్పటి వరకు 50,455 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారని..సిద్దిపేట జిల్లాలో 3747 మంది రైతులు 12,242 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు ఉన్నారని తెలిపారు. రైతుకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయండన్నారు. మన దేశంలో ఆయిల్ పామ్ సాగు తక్కువగా ఉండడం వల్ల లక్షల కోట్ల విలువైనవి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. రైతుల ఆకాంక్షల కు అనుగుణంగా మంచి ధరతో నర్మెటలో ఆయిల్ పామ్ కొనుగోలు చేస్తారని..హార్టికల్చర్ అధికారుల సహకారంతో ఆయిల్ పామ్ సాగు మంచి దిగుబడి వెచ్చెల చూసుకోవాలని తెలిపారు.
ఇటీవల గుజరాత్ లో అమూల్ పాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అయ్యే కేంద్రాన్ని చూశానని..కురియన్ క్షీర విప్లవాన్ని తీసుకొచ్చారు.. లక్షల లీటర్లు ఎక్కడ పాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జంగా రాఘవ రెడ్డి ఆయిల్ పామ్ కార్పోరేషన్ చైర్మన్, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ హైమవతి , అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్,మార్కెట్ కమిటీ చైర్మన్లు,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.