విధాత, హైదరాబాద్ :
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయిన విషయం తెలిసిందే. అలాగే, ఇప్పటికే ఈసీ రిజర్వేషన్లను ఖరారు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్ల కేటాయింపుపై వివాదం చెలరేగింది. రాష్ట్రవ్యాప్తంగా జీవో 46 నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారంటూ హైకోర్టులో వేర్వేరుగా మొత్తం తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటిపైనా జస్టిస్ టి. మాధవి దేవి బుధవారం విచారణ చేపట్టారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ శాతం జీవో 46లో పేర్కొన్న 17 శాతం గరిష్ట పరిమితిని దాటుతోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో జిల్లాలోని మొత్తం 613 గ్రామ పంచాయతీలలో కేవలం 117 సర్పంచి పోస్టులు మాత్రమే బీసీలకు కేటాయించారన్నారు. ఇది బీసీ రిజర్వేషన్లకు విరుద్దం అంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్ నం. 43 ప్రకారం బీసీ రిజర్వేషన్లు 19 శాతానికి చేరాయని, ఇది జీవో 46కు వ్యతిరేకమని వాదించారు. అందువల్ల ప్రస్తుత గెజిట్‌ను రద్దు చేసి రిజర్వేషన్లను పునర్విభజించాలని కోర్టును కోరారు.
ఇక కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం తిమ్మనోనిపల్లి గ్రామ రిజర్వేషన్ కేటాయింపులు కూడా వివాదాస్పదమయ్యాయి. గ్రామంలో మొత్తం ఎనిమిది వార్డులుండగా, అధికారులు అన్నీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకే కేటాయించారని, బీసీ ఓటర్లు స్పష్టమైన మెజారిటీగా ఉన్నప్పటికీ వారిని సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అదే సమయంలో, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి .. 2011 జనాభా లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లు కేటాయించామని, రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ మార్పులు సహజమని కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, రిజర్వేషన్ల పునర్విభజనపై కీలకంగా మారిన ఈ విచారణను గురువారానికి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల వేళలో ఈ కేసులపై హైకోర్టు తీర్పు రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముంది.
