Ande Sri | హైదరాబాద్ : ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ( Ande Sri ) ఇక లేరు. తెలంగాణ ఉద్యమ( Telangana Movement ) సమయంలో ఆయన రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయి.. ఆయన పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. నిలిచిపోతాయి కూడా. అశువు కవిత్వం చెప్పటంలో దిట్టగా పేరొందిన అందెశ్రీ.. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేరు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఎంతో హృద్యంగా అందెశ్రీ కవిత్వం నుంచి ఈ గేయం జాలువారింది. అంటే కన్న తల్లిదండ్రులతో జీవితాంతం ఉంటాం అనేవారు నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు.. యాడ ఉన్నారో కాని కంటికి కనరారు అని అందెశ్రీ అందరి హృదయాలను తాకేలా రాశారు.
అవినీతి, అంధకారంలోన చిక్కిపోయి.. రోజూ శిథిలమౌతున్నారు.. కుక్క నక్కలను దైవరూపాలుగా కొలిచి, పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటారు.. అబ్బా ఎంత నటన..? చీమలకు చక్కెర, పాములకు పాలోసి, జీవనకారుణ్యమే జీవితం అంటారు పైకి. కానీ తోడబుట్టిన మనషులను ఊరు అవతలికి నెట్టి కుల వర్గ అంతస్తు ధనం పదవి అంటూ కలహాల గిరిగీసి ఆనందం పొందుతుంటారని సమాజంలో ఉన్న వాస్తవికతను కళ్లకు కట్టినట్టు వివరించారు అందెశ్రీ.
అందెశ్రీ పాట ఇదే..
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ వున్నాడో కాయాన్ని కంటికి కానరాడు
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
నిలువెత్తు స్వార్ధము నీడలగొస్తుంటే
చెడిపోక ఏమైతదమ్మ చెడిపోక ఏమైతదమ్మ
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల
దిగ జారుతున్నాడోయమ్మా దిగ జారుతున్నాడోయమ్మా
అవినీతి పెను ఆశ అంధకారంలోనే
అవినీతి పెను ఆశ అంధకారంలోనే
చిక్కిపోయి రోజు శిధిలమౌతున్నాడు
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు
కోడి పిళ్ళై చిక్కి కొట్టుకుంటున్నారు
కోడి పిళ్ళై చిక్కి కొట్టుకుంటున్నారు
ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు
అస్థిపంజరామయ్యి అగుపించనున్నాడు
అస్థిపంజరామయ్యి అగుపించనున్నాడు
కదిలే విశ్వము తన కనుసన్నల్లో నడుమ
కదిలే విశ్వము తన కనుసన్నల్లో నడుమ
కనుబొమ్మలుఎగరేసి కాలగమనము లోన
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
కుక్క నక్కలా దైవ రూపాలుగా కొలిచి
పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు
పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు
చీమలకు చక్కర పాములకు పాలోసి
జీవకారుణ్యమే జీవితం అంటాడు
జీవకారుణ్యమే జీవితం అంటాడు
తొడ పుట్టిన వాళ్ళ ఉరవతలకినెట్టి
తొడ పుట్టిన వాళ్ళ ఉరవతలకినెట్టి
కులమంటూ ఇలా మీద కలహాల గిరి గీసి
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
ఇరువైదు పైసలగరొత్తులు కాల్చి
అరవైదు కోట్ల వారములడుగుతాడు
అరవైదు కోట్ల వారములడుగుతాడు
దైవాల పేరుతో ఛంద్దలకై గండ
భక్తి ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు
యుక్తి పేరా నరుడు రక్తిలో రాజై
యుక్తి పేరా నరుడు రక్తిలో రాజై
రాకాసి రూపాన రంజిల్లు తున్నాడు
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి
చుట్టూ తిరుగుతున్నాడమ్మా
అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి
చుట్టూ తిరుగుతున్నాడమ్మా
రూపాయి కొరకు ఏ పాపానికైతేమి
వొడిగట్టే నదిగో చూడమ్మా
కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి
కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి
కోట్లకు పరిగెత్తి కోరికలు చెలరేగి
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
మానవత్వం వున్నా వాడు
మానవత్వం వున్నవాడు
