Site icon vidhaatha

Palamuru Dindi Projects | పాల‌మూరు- రంగారెడ్డి, డిండికి క్లియిరెన్స్‌లు ఇవ్వండి

Palamuru Dindi Projects | పాల‌మూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌ల‌కు వెంట‌నే క్లియ‌రెన్స్‌లు ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని కోరారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జల సంఘం ఆమోదించాలని, ఆ తర్వాత పర్యావరణ శాఖ, సీసీకు ఈసీ జారీ చేయాల్సిందిగా సిపారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా కరువు పీడిత ప్రాంతాల రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని ఉత్తమ్‌ తెలిపారు. కృష్ణా బేసిన్ లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోందని పేర్కొన్నారు.

‘శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 880 అడుగుల వద్ద 1.5 లక్షల క్యూసెక్స్ కంటే ఎక్కువ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లిస్తోంది. ఏకంగా 841 అడుగుల నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని మళ్లించేలా ఏపీ కాల్వల నిర్మాణాలు చేపట్టింది. 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటు ముచ్చుమర్రి, మలయాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మించింది. కృష్ణా నది నుంచి వరద నీటిని బేసిన్ వెలుపల ప్రాంతాలకు డైవర్ట్ చేస్తున్నది’ అని ఫిర్యాదు చేశారు. కేడబ్ల్యుడీటీ‌‌-I అవార్డు ప్రకారం చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులివ్వాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసీన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్ఎంబీ అడ్డుకోవాలని, కృష్ణా జలాల మళ్లింపుపై నియంత్రణలు విధించాలని, ఇన్-బేసిన్ అవసరాల విషయంలో కేఆర్ఎంబీ న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. నీటి ప్రవాహాలను ఖచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ అమలు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నీటిని కేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కెనాల్కు నీటిని డైవర్ట్ చేస్తోందని, ఇది కేడబ్ల్యూడీటీ 1 అవార్డును ఉల్లంఘించటమే అవుతుందని పేర్కొన్నది.

శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ప్రమాదకరంగా మారిందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పదే పదే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్లంజ్ పూల్‌కు మరమ్మతులు చేపట్టలేదని పేర్కొన్నారు. 2007లో కేంద్ర ప్రభుత్వం AIBP సాయంతో తెలంగాణకు జీవనాడిగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ చేపట్టిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్నందున, అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version