విధాత, హైదరాబాద్ : బీసీ కుల గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఒకవేళ కాంగ్రెస్ దీనిపై వెనకడుగు వేస్తే మొదట ప్రశ్నించే వాడిని తానేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి కంటే తీన్మార్ మల్లన్న పేరే నాకు పెద్దదని, బీసీల హక్కుల సాధనలో రాజకీయాలకు అతీతంగా పోరాడుతానన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో సమగ్ర కులజన గణన, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలో మల్లన్న పాల్గొని మాట్లాడారు. బీసీలకు రాజకీయంగా, రాజ్యాధికార పరంగా అన్యాయం జరుగుతుందన్నారు. పార్టీ ముఖ్యం కాదని, రేవంత్ రెడ్డి కావాలా ? బీసీ లు కావాలా ? అంటే బీసీలే కావాలి అంటానన్నారు. అన్ని పార్టీల వాళ్లం కలిసి బీసీల హక్కుల సాధనకు ఉద్యమిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రాజారాం యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎల్. రమణ, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య , బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ కుల సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.