విధాత, హైదరాబాద్ : వయనాడ్ వరద బాధితుల ప్రజల కోసం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పార్టీ నాయకులు హైదరాబాద్ పట్టణంలో విరాళాలు సేకరించారు. హైదరాబాద్ లోని అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో సీపీఐ నాయకులు ప్రజల నుంచి విరాళాల సేకరణ చేశారు. అత్యంత క్లిష్ట కాలాన్ని ఎదుర్కొంటున్న వయనాడ్ ప్రజలను ఆదుకోవడం మనందరి సమిష్టి బాధ్యత అని నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వారు తమ సహాయాన్ని వయనాడ్ బాధితుల కోసం అందించేందుకు ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం రాజకీయ వివక్షత చూపకుండా బాధ్యతతో వ్యవహరించి కేరళా ప్రభుత్వానికి సహాయం అందించాలని కోరారు. వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడటం..వరదల కారణంగా 357మంది మృతి చెందగా, 206మంది గల్లంతయ్యారు. ప్రకృతి సృష్టించిన భారీ విధ్వంసానికి ఎదురైన ప్రాణ నష్టంతో వయనాడ్ ప్రజలు తల్లడిల్లారు. సైన్యంతో సహా అన్ని విభాగాల రక్షణ బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.