విధాత, హైదరాబాద్ : రాష్ట్ర విభజన అపరిష్కృత సమస్యలపై ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం ఏ.రేవంత్‌రెడ్డిల భేటీ ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చించేందుకు ముఖాముఖీ భేటీ కావాలని ఏపీ, తెలంగాణ సీఎంలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ మంత్రులు, అధికారుల బృందంతో కలిసి చంద్రబాబు ప్రజా భవన్‌కు వచ్చారు. ప్రజాభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ షెడ్యూల్ ప్రకారం ఆరు గంటలకు ప్రారంభమైంది. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొనగా.. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యవుల కేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ.జనార్దన్, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, మరికొందరు అధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సమస్యలను పరిష్కరించాలి : మంత్రి తుమ్మల
\తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ పలు అంశాలపై లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముణ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో అంశంపై చర్చించాలని కోరారు. ఇదిలా ఉంటే, రేవంత్, చంద్రబాబుల సమావేశం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సైతం ఇదే విషయం ప్రస్తావించారు. టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటుగా ఈ భేటీలో దేవాదాయ భూములకు సంబంధించిన అంశాలపై చర్చించాలన్నారు. టీటీడీ నుండి తెలంగాణలోని ఆలయాలకు రూ.10 లక్షల ఫండ్స్ రావాలని గుర్తు చేశారు. అంతకుముందు మంత్రి తుమ్మల మరో లేఖలో భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనంపై చర్చించాలని రెండు రాష్ట్రాల సీఎంలను కోరారు.