Site icon vidhaatha

రేప‌టితో ముగియ్యనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం

27న పోలింగ్
ఉద్యోగులకు సెలవు

విధాత : వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేడు శనివారం సాయంత్రం 4గంటలకు ముగిసిపోనుంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుండటంతో పోలింగ్‌కు 48గంటల ముందే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సివుంది. నేడు చివరి ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి సమయముండటంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ ఎన్నికల్లో 52మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 4,61,806 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌), బీఆరెస్ నుంచి ఎనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా కోచింగ్ సెంటర్ల నిర్వాహకుడు అశోక్‌లు పోటీ పడుతున్నారు. ఆయా పార్టీల తరుపునా ఇప్పటికే మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం నిర్వహించారు.

పోలింగ్ రోజు ఉద్యోగులకు సెలవు

ఈనెల 27న జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది.

ఈ నిర్ణయంతో నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్ధిపేట్ జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలవు లభించనున్నది. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఈసీ నిబంధనలు లేవని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఓటు వేసేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని, ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించింది.

Exit mobile version