Summer | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో కాలు తీసి బయటకు పెట్టాలంటేనే భానుడి సెగలకు భయపడిపోతున్నారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు పాటు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి పగలు వడగాల్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.6 డిగ్రీలు ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్‌లో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా.. వడదెబ్బకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.