విధాత : తెలంగాణ ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏ తెలంగాణా కావాలో ప్రజలు తేల్చుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ గెలుపు కోరుతూ నిర్వహించిన జవహార్ నగర్ రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ప్రజల్ని మరోసారి మోసం చేసి కేసీఆర్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజల ముందుకు వస్తున్నాడన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం మేడ్చల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఐటీ పార్కు ఇవ్వలేదన్నారు. జవహర్ నగర్ ప్రజలకు డంపింగ్ యార్డ్ బాధ పోలేదన్నారు.
మేడ్చల్ నియోజకవర్గంతో పాటు హైద్రాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పాలనలో చేసింది తప్ప బీఆరెస్ హాయంలో చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. ఇప్పుడు రూ.1200కి చేరిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, పేదల ప్రభుత్వం రావాలంటే దొరల ప్రభుత్వం కూలాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. మేడ్చల్‌కు డిగ్రీ కాలేజీ, 100 పడకల హాస్పిటల్ తెచ్చే బాధ్యత మాది అన్నారు.
హైదరాబాద్ రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందజేస్తామని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, పేదలందరికీ ఇందిరమ్మ ఇంటికి 5లక్షలు మంజూరు చేస్తామన్నారు. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. 10లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, 4వేల పెన్షన్ కాంగ్రెస్ ఇవ్వబోతుందన్నారు. కాంగ్రెస్ ఆరుగ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించే అన్ని హామీలను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అమలు చేయబోతున్నామన్నారు.