విధాత: పోలింగ్ రోజు కావాలని ఇలాంటి సంఘటనలకు తెరలేపారని, తెలంగాణ ప్రజలు సమయ స్పూర్తితో వ్యవహరించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. నాగార్జున సాగర్ ఘటనపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఏమి ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే వీటన్నింటికి శాశ్వత పరిష్కారమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని తెలిపారు.
దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్నాం.. అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా అని అన్నారు. అవసరమైనప్పుడల్లా ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారన్నారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించవన్నారు. కేసీఆర్ వి దింపుడు కల్లం ఆశలేనని ఎద్దేవా చేశారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదన్నారు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాదని తెలిపారు.