– జన సందోహం మధ్య రేవంత్ ఉద్విగ్న ప్రసంగం
– ఆద్యంతం కేసీఆర్ కుటుంబంపై ఘాటైన వ్యాఖ్యలు
– కాంగ్రెస్ శ్రేణులతో పులకించిన పాలమూరు, నారాయణ పేట, మక్తల్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: జనసందోహం… ఇసుక వేస్తే రాలనంత జనం. తండోప తండాలుగా తరలి వచ్చిన జనం మధ్య ఉద్విగ్న ప్రసంగం… కేసీఆర్ కుటుంబంపై ఘాటైన వ్యాఖ్యలు…. ఇదంతా ఆదివారం నారాయణ పేట, మక్తల్, మహబూబ్ నగర్ లో జరిగిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభ, కార్నర్ మీటింగ్ ల దృశ్యాలు. ఈ జనసందోహం చూస్తే కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఇట్టే తెలిసిపోతున్నది. ఇది కాంగ్రెస్ బలమా.. రేవంత్ రెడ్డిపై ఉన్న ప్రేమా.. అనే విషయంపై రాజకీయ నేతలు తర్జనభర్జన అవుతున్నారు. రేవంత్ రెడ్డి క్రేజీ చూసి బీఆర్ఎస్ నేతల ఓటమి ఖాయమే అన్న అభిప్రాయం జిల్లా ప్రజల్లో నెలకొంది. నారాయణ పేటలో జరిగిన బహిరంగ సభలో జనసందోహాన్ని చూసిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించి, అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి అందులో ఆ కుటుంబాన్ని ఉంచుతామని అనగానే.. ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ప్రజలు కోసం జీవితాన్ని కోల్పోయిన చిట్టెం నర్సిరెడ్డి వారసురాలు పర్ణిక రెడ్డిని ఆశీర్వదించి ఆ కుటుంబ రుణం తీరుచ్చుకునే అవకాశం మనకు వచ్చిందని రేవంత్ అనగానే సభలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. నర్సిరెడ్డి తన రక్తం చిందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేయడంతో సభలో హర్షద్వానాలు మోగించారు. అనంతరం మక్తల్ లో జరిగిన సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈసభలో కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య పాల్గొన్నారు.
ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని సిద్దరామయ్య ఆసక్తిగా విన్నారు. దేవరకద్రలో జరిగిన కార్నర్ మీటింగ్ కు జనం తరలి వచ్చారు. అనంతరం పాలమూరు జిల్లాకేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో జనం కిక్కిరిసిపోయారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై ఘాటైనా వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ప్రజల నుంచి భారీఎత్తున స్పందన వచ్చింది. ‘నేను మీరు పెంచిన మొక్కను… పెరిగి పెద్దదిగా మారింది.. రాష్ట్రానికి చల్లని నీడను ఇద్దామనుకుంటే కేసీఆర్ దొంగల ముఠా.. భుజాలపై గొడ్డళ్ళు వేసుకుని ఈ చెట్టును నరకడానికి వస్తున్నారు, పాలమూరు పౌరుషం చూపించి ఆ ముఠాను వంద అడుగుల లోపల పాతిపెట్టాలి’ అని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చిన సమయంలో జనం కేరింతలు.. ఈలలు కొట్టారు. ఈ మీటింగ్ కోసం పాలమూరు రహదారుల్లో ప్రజలు బారులుతీరారు. రేవంత్ రెడ్డి సభలు చూస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.