ఈసారి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేత‌నాలు ప‌డేది ఎప్పుడో తెలుసా!

తెలంగాణ‌లో జీతాలు ఎప్పుడు ఇస్తారా? అని ప్ర‌భుత్వ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురు చూసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది

  • Publish Date - January 30, 2024 / 10:29 AM IST

విధాత‌: తెలంగాణ‌ రాష్ట్రంలో జీతాలు ఎప్పుడు ఇస్తారా? అని ప్ర‌భుత్వ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురు చూసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. బీఆరెస్ ప్ర‌భుత్వం నిధుల లేమితో ఉద్యోగాల‌కు 1వ తేదీన వేత‌నాలు ఇవ్వ‌లేక పోయింది. మారుమూల జిల్లాల్లోనైతే 15 నుంచి 20వ తేదీ వ‌ర‌కు వేత‌నాలు ఇచ్చే వార‌న్న చ‌ర్చ జ‌రిగింది. హైద‌రాబాద్‌కు ఆనుకొని ఉండే జిల్లాలైన న‌ల్ల‌గొండ‌, యాదాద్రి భువ‌నగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సైతం ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు 1వ తేదీ వ‌చ్చిన వారం రోజుల త‌రువాత కానీ వేత‌నాలు ఇచ్చే వారంట‌.. దీంతో ఉద్యోగులకు నెల‌వారీ చెల్లింపులకు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంటున్నది.

2014 వ‌ర‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు ఠంచ‌న్‌గా ప్ర‌తి నెల 1వ తేదీన జీతాలు వారి అకౌంట్ల‌లో జ‌మ అయ్యేవి. 1వ తేదీన సెల‌వు వ‌స్తే ముందు తేదీనే వేత‌నాలు విడుద‌ల చేసేవారు. ఏనాడూ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాల ఇబ్బందులు రాలేదు. పెన్ష‌న‌ర్ల‌కు కూడా ప్ర‌భుత్వ ఉద్యోగుల మాదిరిగానే 1వ తేదీన పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఉద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ స్వ‌రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు వేత‌నాల, పింఛన్లు 1వ తేదీ త‌రువాత ఎప్పుడు త‌మ అకౌంట్‌లో ప‌డ‌తాయా? అని ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు 20వ తేదీ వ‌ర‌కు వేత‌నాలు ఇచ్చేవారు.. ఒక్కో చోట్ల రెండు, మూడు నెల‌ల‌కు కూడా వేత‌నాలు ఇవ్వ‌ని ప‌రిస్థితి నాడు నెల‌కొన్న‌ది. ఇలా ఉద్యోగుల వేత‌నాల ప‌రిస్థితి ఆగమ్య‌గోచ‌రంగా నాడు ఉండేది. ఉద్యోగులు హ‌మ్మ‌య్య ఈ రోజు జీతం ప‌డిందా? అని అనుకునే ప‌రిస్థ‌తి నాడు ఏర్ప‌డింది.

ఉద్యోగుల‌కు 1వ తేదీన వేత‌నాలు అంద‌క పోవ‌డంతో క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లించే హౌసింగ్ లోన్‌, కార్ లోన్‌, ఎడ్యుకేష‌న్‌లోన్‌, ప‌ర్స‌న‌ల్ లోన్ ఇలా వివిధ అవ‌స‌రాల కోసం జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు నెల‌స‌రి వాయిదాలు (EMI) చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగుల‌ను డిఫాల్ట‌ర్స్‌గా చూపించాయి. దీంతో చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ‌ సిబిల్(CBIL) స్కోర్‌ ప‌డిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక్క‌సారి సిబిల్ స్కోరింగ్ ప‌డిపోతే బ్యాంకులు ఇత‌ర అవ‌స‌రాల‌కు రుణాలు తీసుకోవడం క్లిష్టంగా మారుతుంది. డిఫాల్ట్ ఎక్కువ‌గా అయిన‌ట్లు చూపిస్తే రుణాలు ఇవ్వ‌కుండా ఆ వ్య‌క్తిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తాయి. ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఏర్ప‌డింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు చాలా మంది గ‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్నారు. న‌వంబ‌ర్ 30 వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్య‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటు వేసి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

తాము ఉద్యోగుల ప‌క్ష‌పాత‌మ‌ని ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు మ‌ద్ద‌తు తెలిపినా కానీ ఇత‌ర బెనిఫిట్‌ల సంగ‌తి దేముడెరుగు.. క‌నీసం వేత‌నాలైన 1వ తేదీన ఇస్తారా? అన్న సందేహాలు వ్య‌క్తం చేశారు. అయితే డిసెంబ‌ర్ 7వ తేదీ ప్రభుత్వ పాల‌నా ప‌గ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇచ్చే అంశంపై ఫోక‌స్ పెట్టింది. ఆర్థిక శాఖ‌తో నిర్వ‌హించిన మొద‌టి స‌మావేశంలోనే 1వ తేదీన ఉద్యోగులకు వేత‌నాలు ఇచ్చే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే రామ‌కృష్ణారావును ఆ దేశించింది. దీంతో ఆర్థిక శాఖ డిసెంబ‌ర్ చివ‌రి వారంలో ఇత‌ర చెల్లింపులు నిలిపి వేసి జ‌న‌వ‌రి మొద‌టి వారంలో వేత‌నాలు ఇచ్చారు. దీంతో మొద‌టి నెల అయితే ఇచ్చారు.. ప్ర‌తి నెల ఇదే విధంగా ఇస్తారా? లేదా అన్న‌ది వేచి చూద్దామ‌న్న తీరుగా ఉన్నారు. అయితే అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇచ్చే అంశంలో ఏమాత్రం ఉదాసీత‌గా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఒక్క ఉద్యోగికి స‌కాలంలో వేత‌నం ఇవ్వ‌డం అంటే ఆ కుంటుబానికి ఇబ్బందులు లేకుండా చేయ‌డం కింద భావించాల‌ని, పైగా ఉద్యోగుల‌కు ఉచితంగా ఏమీ ఇవ్వ‌డం లేదని, నెల రోజులు ప‌ని చేయించుకొని ఇస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్న‌ట్లు తెలిసింది. ఉద్యోగుల వేత‌నం వారి హ‌క్కు.. వారంద‌రికీ ఒక‌ట‌వ తేదీనే వేత‌నం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగితేనే ప్ర‌భుత్వ ఉద్యోగి ఆఫీసులో మ‌న‌స్సు పెట్టి ప‌ని చేస్తాడ‌ని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారుల‌కు వివ‌రంగా చెప్పిన‌ట్లు తెలిసింది. దీంతో ఆర్థిక శాఖ ఇక నుంచి ప్రభుత్వానికి ఎన్ని ర‌కాల ఇబ్బందులున్నా.. ఉద్యోగుల‌కు ఒక‌ట‌వ తేదీనే వేత‌నం, పెన్ష‌న‌ర్ల‌కు పెన్ష‌న్ ఇవ్వాల‌ని నిర్ణయించి, ఆ మేర‌కు ప్లానింగ్ చేసింది. చివ‌రి వారం రోజులు ఇత‌ర చెల్లింపులు వాయిదా వేసి, వ‌చ్చిన ఆదాయాన్ని ఉద్యోగుల వేత‌నాల కోసం ఆర్థిక శాఖ‌ రిజ‌ర్వ్ చేసి, 1వ తేదీన చెల్లింపులు చేస్తున్న‌ది. ఈ మేర‌కు ఈ నెల వేత‌నం, పెన్ష‌న్ల‌ను 1వ తేదీన ఉదయం వ‌ర‌కు అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ అయిన‌ట్లు ఉద్యోగుల సెల్ ఫోన్‌ల‌కు మెసేజ్ వెళ్లేలా ట్ర‌జ‌రీల‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ ట్ర‌జ‌ర‌రీల‌న్నీ ఉద్యోగుల‌కు వేత‌నాల‌ను వారి అకౌంట్ల‌లో జ‌మ చేసే ప‌నిలో ఉన్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద‌రికీ కూడా నాలుగ‌వ తేదీలోగా పూర్తిగా వేత‌నాలు చెల్లించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

ఇదీ వేతనాలు, పెన్షన్ల ఖర్చు..

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు ప్ర‌తి నెల వేత‌నాలు, పెన్ష‌న‌ర్ల కింద నెల‌కు రూ. 4539.79 కోట్లు అవుతున్న‌ది. ఇది నవంబ‌ర్ నెల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కాగ్‌కు తెలిపిన జ‌మా, ఖ‌ర్చుల‌లో ఉన్న వివ‌రాల ఆధారంగా తెలిసింది. ఇది ఒక్కో నెల ప‌ద‌వీ విమ‌ర‌ణ‌లు, రిక్రూట్‌మెంట్ల ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయి. రాష్ట్రంలో స‌ర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు 4,66,590 మంది ఉన్నారు. వీరిలో 1,59,567 మంది సీపీఎస్ ఉద్యోగులు, మిగిలిన 3,07,023 మంది రెగ్యుల‌ర్ పెన్ష‌న్ ఎంప్లాయీస్. వీరు కాకుండా కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌లో 2 ల‌క్ష‌ల‌కుపై గా ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో కుటుంబ పెన్ష‌న్‌, స‌ర్వీస్ పెన్ష‌న‌ర్లు అంతా క‌లిపి 2,63,302 మంది ఉన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు

1. మొత్తం రెగ్యుల‌ర్ ఎంప్లాయీస్ : 3,07,023

ఏ) గెజిటెడ్ : 30,403

బి) నాన్ గెజిటెడ్ : 2,46,608

సీ )క్లాస్ ఫోర్త్ : 30,012

2. సీపీఎస్ ఎంప్లాయీస్ : 1,59,567

3. పెన్ష‌న‌ర్లు : 2,63,302

4. ఔట్ సోర్సింగ్‌ ఎంప్లాయీస్: 2 ల‌క్ష‌ల పైచిలుకు

Latest News