అవిశ్వాసానికే ముందే రవిందర్‌రావు, మహేందర్‌రెడ్డిల రాజీనామా
విధాత, హైదరాబాద్: టెస్కాబ్ (తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్) చైర్మన్ కొండూరి రవీందర్ రావు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై కూడా మెజార్టీ డైరక్టర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టగా, ఈ నెల 10న ఓటింగ్ జరుగాల్సివుంది. ఇంతలోనే కొండూరితో పాటు వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కూడా తమ పదవులకు రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా మెజార్టీ డైరక్టర్లు బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిపోయారు.
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టెస్కాబ్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ సహా తొమ్మిది మంది డైరక్టర్లు ఉండగా, మిగతా ఏడుగురు డైరక్టర్లు చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం ప్రతిపాదించారు. అవిశ్వాసం ఓటింగ్ సందర్భంగా ఓటమి ఖాయమని తేలడంతో కోడూరి, మహేందర్‌రెడ్డిలు ముందే రాజీనామా చేసి అస్త్ర సన్యాసం చేసేశారు. కోడూరి కాంగ్రెస్‌లోకి వస్తే ఆయన చైర్మన్ పదవి పదిలంగా ఉంచుతామని ప్రభుత్వం వైపు నుంచి ఆఫర్ ఇచ్చినప్పటికి కేటీఆర్‌కు సన్నిహితుడైన కోడూరు అందుకు సిద్దపడకుండా పదవిని వదిలేసుకోవడం విశేషం.
మా డైరక్టర్లు పార్టీ మారడంతోనే రాజీనామా : కోడూరి
టెస్కాబ్‌లోని మా పార్టీ డైరక్టర్లుగా ఉన్న వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినందునా తాను ఆ పదవిలో కొనసాగలేనన్న ఉద్దేశంతో చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లుగా కొడూరి రవిందర్‌రావు ప్రకటించారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలని, 2015లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆవిర్భావం జరిగిందని, రాష్ట్ర సహకార బ్యాంకులో ఇప్పుడు మెజార్టీ డైరెక్టర్లు పార్టీలు మారారని, విశ్వాసం కోల్పోయిన చోట ఉండవద్దని నేను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. టెస్కాబ్ చైర్మన్ గా నేను, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా సహకార వ్యవస్థలో ప్రగతి జరిగిందని భావిస్తున్నామని, రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా నేను తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నానని, తెలంగాణ సహకార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుకు అనేక అవార్డులు వచ్చాయని, ఈ ప్రభుత్వ విధానాలు అందరికీ బాగుండేలా ఉండాలని ఆకాంక్షించారు. సహకార వ్యవస్థలో మా హయాంలో రిటైర్డ్ అధికారులను పెట్టలేదని, నేను నా ఇష్టం వచ్చినట్లు ఎవరికీ పదవులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.