బీజేపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి పంట‌కు మ‌ద్ధ‌తు ధ‌ర‌:కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి

మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ దేశంలో ఎక్క‌డ రైతాంగానికి విద్యుత్తు కోత‌లు లేవ‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

  • కేటీఆర్‌ను సీఎం చేయ‌డంపై ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జ‌ల‌పై లేదు
  • మోడీ వ‌చ్చాకే రైతాంగానికి విద్యుత్తు స‌మ‌స్య‌లు త‌ప్పాయి

విధాత‌, హైద‌రాబాద్‌: మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ దేశంలో ఎక్క‌డ రైతాంగానికి విద్యుత్తు కోత‌లు లేవ‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి. బీజేపీ స‌ర్కారు రాక ముందు దేశ‌వ్యాప్తంగా విద్యుత్తు కోత‌లు ఉండేవ‌న్నారు. శ‌నివారం నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు స‌ద‌స్సు ఏర్పాటు చేశారు. రైతుల‌కు ఎరువుల స‌మ‌స్య‌ను ప్ర‌ధాని మోడీనే తీర్చార‌న్నారు. ప‌ది ఎక‌రాలు ఉన్న రైతుకు ఎరువుల మీద రెండు ల‌క్ష‌ల స‌బ్సిడీ కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు.


 


250 రూపాయలు ఒక బస్తాకు రైతు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక్క ఎకరాకు 2,000 వరకు సబ్సిడీ భరిస్తోందన్నారు. ఒక ఎకరానికి ఒక ఏడాదికి మోడీ ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ అందిస్తోందన్నారు. ఎరువుల పరిశ్రమ, ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ప్రారంభానికి మోడీ వస్తే కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ లో పడుకున్నాడని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వ‌స్తే రైతు పండించిన ప్ర‌తి పంట‌కు బీమా క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌న‌వ‌రి 1 నుంచే డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అధికారంలోకి రాగానే రైతు హామీలను అమలు చేస్తుంద‌న్నారు. తెలంగాణ‌లో రైతు రాజ్యాన్ని తీసుకొస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయ‌డంపై ఉన్న శ్ర‌ద్ధ తెలంగాణ ప్ర‌జ‌ల పై లేద‌ని మండిపడ్డారు.