ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ రాజకీయ హామీలా ?

  • Publish Date - November 10, 2023 / 01:34 PM IST

మైనార్టీ డిక్లరేషన్‌పై కిషన్‌రెడ్డి గరం



విధాత : కాంగ్రెస్ డిక్లరేషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ట్వీట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ప్రజలు కట్టిన పన్నుతో బుజ్జగింపు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఎవరైనా అంటూ విమర్శించారు. 60 ఏండ్లుగా దేశంలో సంతుష్టీకరణ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, ‘మైనారిటీ డిక్లరేషన్’ పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని తన సొంత రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకునేందుకు కుట్రపన్నుతోందన్నారు.


విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమేనని, దీంతోపాటుగా కాంగ్రెస్ ఇస్తున్న హామీలన్నీ ఖజానాపై పెనుభారాన్ని వేసేవేనన్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే మతప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి వాటిని ఎస్టీలు, బీసీలకు అందజేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు మేల్కోవాలని, కాంగ్రెస్‌ మాయలో పడిమోసపోకండని పేర్కోన్నారు.