విధాత : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం, మతకలహాలు, బాంబు పేలుళ్లకు ఆస్కారం ఏర్పడుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘాట్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆదిత్యనాధ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ అధ్వర్యంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదన్నారు. అవినీతి, అస్థిర పాలన సాగించే కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆరెస్ పార్టీ హాయంలో అభివృద్ధి కుంటుపడి అవినీతి పెరిగిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు.
ఈ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని, తెలంగాణ మాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. తెలంగాణలో పరీక్ష పత్రాలు లీకై ఎంతో మంది నిరుద్యోగ యువకులు అత్మహత్య చేసుకున్నారని, ఈ ఎన్నికల్లో యువకులు తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. తాను గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీ ఓట్లడగడగానికి వచ్చానని, అప్పుడు బీజేపీ కార్పొరేటర్లు గెలిచి హైదరాబాదులో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. నేడు మళ్లీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నగరానికి వచ్చానని, హైదరాబాద్ నగరం అంటే మాకు ఎంతో ఇష్టమన్నారు. ప్రధాని మోడీ పాలన దేశానికి శ్రీరామ రక్ష అని, మోడీని ప్రపంచ దేశాలు గౌరవిస్తూ కొనియాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు అనిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, చింతల సురేందర్ యాదవ్, కార్పొరేటర్లు అచ్చిరెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, అరుణ సురేందర్ యాదవ్, పవన్ కుమార్, నరసింహ గుప్తా, వంగ మధుసూదన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.