విధాత, హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవం అని, బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయి… ప్రాసెస్ అంతా నేనే దగ్గరుండి చూశానని రాష్ట్ర పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా చిట్ చాట్ లో ఉత్తమ్ మాట్లాడుతూ నీటిపారుదలశాఖలో భారీగా అధికారుల బదిలీలు చేపట్టామని, 106 మంది అధికారులను బదిలీ చేస్తూ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. మంత్రుల మధ్య విభేదాలను కొట్టిపారేశారు. కేబినెట్ మంత్రుల మధ్య విభేదాల వార్తలు అవాస్తవమని..మంత్రుల మధ్య సమన్వయం ఉందన్నారు. నేను నా శాఖ, నా జిల్లా అభివృధి పనులపై నేను ఫోకస్ పెట్టాను అన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూన్నామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా మా హక్కులను వదులుకునేది లేదన్నారు.
పోలవరం, బనకచర్లపై సీడబ్ల్యుసీకి లేఖ
బనకచర్ల, ఆల్మట్టిపై మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నాం అని ఉత్తమ్ తెలిపారు. పోలవరం, బనకచర్లపై సీడబ్ల్యుసీకి లేఖ రాశామని తెలిపారు. కృష్ణా, గోదావరి లో నీటి వాటాల కోసం ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. త్వరలోనే మహారాష్ట్ర వెళ్తున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రాజెక్టుల నిర్మాణాలు, నీటి వాటాలపై చర్చలు జరుపుతామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లలో చేసింది ఏమీలేదు అని…కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా…భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయి అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నాం అని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు అంతటా ప్రారంభిస్తున్నామన్నారు.