విధాత: హుజూర్‌నగర్‌లో వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో గెలుస్తానంటూ ఉత్తంకుమార్ రెడ్డి ఉత్త మాటలు చెబుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. శనివారం హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చేతనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తనపై పోటీ చేసి ముందు 50వేల ఓట్లు తెచ్చుకోవాలని, ఆ తర్వాత గెలుపోటములెవరివో, ఎవరి మెజారిటీ ఎంతో చూసుకోవచ్చని అన్నారు.
తనతో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధిలో పోటీ పడకుండా అసత్యాల ప్రచారంలో మునిగి తేలుతున్నారన్నారు. ఆయనను సొంత పార్టీ వారే నమ్మడం లేదని, అటు బయట పార్టీ వారు నమ్మడం లేదని నియోజకవర్గం ప్రజలు ఎట్లా నమ్ముతారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని ఉత్తంకుమార్ రెడ్డి నియోజక వర్గాన్ని ఎలా అభివృద్ధి చేయగలడని ప్రశ్నించారు.
తాను నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఉత్తమ్ చెప్పుకోవడం హాస్యా స్పదమన్నారు. కేంద్ర నిధులు అని బోర్డు కనబడితే చాలు తానే నిధులు తీసుకొస్తున్నా అంటూ ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ పచ్చి అబద్దాలని.. ఎప్పుడు అబద్ధాల్లోనే ఉత్తంకుమార్ రెడ్డి మునుగు తేలుతూ ఉంటాడని సైదిరెడ్డి విమర్శించారు.
హుజూర్‌నగర్‌లో శుక్రవారం మంత్రి కేటీఆర్, జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా రూ.120 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషదాయకమని, మరో వంద కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు ప్రకటించుకోవడం జరిగిందన్నారు.
ఇందుకు నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి, తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వమే శ్రీరామరక్ష అని సైదిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.