– చెన్నూరు నియోజకవర్గం గంగారంలో నిరసన
– మా ఊరికి ఏం చేశారంటూ గ్రామస్థుల నిలదీత
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఎన్నికల వేళ ప్రచారాలకు వెళ్తున్న బీఆరెస్ అభ్యర్థులను పలు నియోజకవర్గాల్లో జనం తరుముతున్నారు. గ్రామాల్లోకి రాకుండా ఊరిబయటే ప్రచార వాహనాలు, నేతలను అడ్డుకుంటున్నారు. గత ఎన్నికల హామీలపై నిలదీస్తున్నారు. పదేళ్లుగా పల్లెల్లో ఏం అభివృద్ధి చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేతలను ఎక్కడికక్కడే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గంలో గులాబీ పార్టీకి ఎదురైంది. బీఆర్ఎస్ అభ్యర్థి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం నుండి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా ప్రచార రథాన్ని ఊరూరా తిప్పుతున్నారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఈ వాహనంలోని మైకుల ద్వారా వివరిస్తూ, ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఈ ప్రచార రథం చెన్నూరు మండలంలోని గంగారం గ్రామానికి వెళ్లింది. ప్రచార వాహనాన్ని గమనించిన గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ఊరి బయటే వాహనాన్ని మహిళలు అడ్డగించారు. గ్రామంలోకి రాకూడదంటూ అక్కడే వాహనాన్ని నిలిపేశారు. ఇప్పటివరకు మీరు మాకు ఏం చేశారని స్థానిక మహిళలు రథాన్ని అడ్డుకున్నారు. మా గ్రామానికి రోడ్డు కూడా లేదని నిరసన తెలియజేశారు. ప్రచార రథం మా ఊరికి రావద్దని భీష్మించారు. చేసేది లేక బీఆరెస్ నాయకులు ప్రచార వాహనాన్ని గ్రామంలోకి రాకుండానే వెనుతిరుగాల్సి వచ్చింది.