తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం.. మాజీ ఎంపీ వివేక్

  • Publish Date - November 10, 2023 / 02:24 PM IST

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతోందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని వివేక్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏఐసీసీ అబ్జర్వర్ సునీల్ జోషి ఆధ్వర్యంలో మంచిర్యాల పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి వినోద్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు. ఆపార్టీని ఎవరూ నమ్మడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.


పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ పై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒక మంచిర్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని అన్నారు. వారు చేస్తున్న అవినీతి కళ్ళముందే కనిపిస్తుందని, కోట్లాది రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంతో పాటు బుంగ పడిందని… అవినీతికి ఇదే సాక్ష్యం అని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రజల కోసం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా.. అది అధికార పార్టీ నాయకుల పాలిట వరంగా మారిందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధులో అవినీతి రాజ్యమైందన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యానికి మారుపేరని, ఈనెల 30న తమ చైతన్యాన్ని బీఆర్ఎస్ కు రుచి చూపిస్తారని తెలిపారు.