జీవో 15ను ర‌ద్దు చేయండి, లేదంటే 400 నామినేన్లు వేస్తాం

  • Publish Date - October 29, 2023 / 04:47 PM IST
  • మా ఇళ్లు, ఇంటి స్థ‌లాల‌ను నిషేధిత జాబితా నుంచి తొల‌గించండి
  • నిర్మాణాల‌కు అనుమ‌తి ఇవ్వండి
  • లేకుంటే మేడ్చ‌ల్‌లో మూకుమ్మ‌డి నామినేష‌న్లు వేస్తాం
  • బోడుప్ప‌ల్,ఘ‌ట్‌కేస‌ర్‌, పీర్జాదిగూడ వ‌క్ఫ్‌బోర్డు బాధితుల జేఏసీ

విధాత‌, హైద‌రారాబాద్‌: బోడుప్ప‌ల్‌, ఘ‌ట్‌కేస‌ర్‌, పీర్జాదిగూడ‌ల‌లోని అప‌రిష్కృతంగా ఉన్న వ‌క్ఫ్‌బోర్డు స‌మ‌స్య ను ప‌రిష్క‌రించాల‌ని బాధితుల సంఘం కోరింది. తాము ఎప్పుడో కొనుగోలు చేసుకొని, ఇళ్లు నిర్మించుకున్న త‌రువాత వీటిని వ‌క్ఫ్ బోర్డు భూములంటూ తీసుకువ‌చ్చిన జీవో 15ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ఆదివారం బోడుప్ప‌ల్‌లోని పెంటారెడ్డి కాల‌నీ క‌మ్యూనిటీ హాల్‌లో బాధితులంతా స‌మావేశ‌మ‌య్యారు. జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. జీవో 15 తీసుకువ‌చ్చిన త‌రువాత త‌మ ఇళ్లను, ప్లాట్ల‌ను పిల్ల‌ల చ‌దువుల‌కు, పెళ్లిళ్ల‌కు అమ్ముకోవ‌డానికి అవ‌కాశం లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారని వాపోయారు.


అలాగే ఎల్ ఆరెస్ చేసిన స్థ‌లాల్లో కూడా ఇండ్లు క‌ట్టుకోకుండా మున్సిప‌ల్ అధికారులు అడ్డుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో దాదాపు 20 ఏళ్ల కింద డ‌బ్బులు పెట్టి కొనుక్కున్న త‌మ భూములు త‌మ‌కు కాకుండా పోతాయా ఏమిట‌న్న ఆందోళ‌న‌లో ఉన్నారు. ఏడాది క్రితం అకార‌ణంగా తీసుకువ‌చ్చిన ఈ జీవో కార‌ణంగా దాదాపు 7,700 కుటుంబాలు తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నాయ‌ని జేఏసీ కన్వినర్ శ్రీ‌ధర్ , కో ఛైర్మన్ లు కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ గౌడ్‌, బాధితుడు చంద్రమౌళి లు తెలిపారు. తాము జిల్లా మంత్రి మ‌ల్లారెడ్డికి, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి అనేక సార్లు తీసుకు వెళ్లినా కూడా చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు.


ఈ విష‌యంపై కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిరాహార దీక్షలు చేశామని, వంటావార్పులు చేసి త‌మ నిర‌స‌న తెలియ‌జేసినా స్పంధించ‌లేద‌న్నారు. బోడుప్పల్ మున్సిప‌ల్ మీటింగ్‌లో నిర‌స‌న తెలిపి కమీషనర్ దృష్ట‌కి స‌మ‌స్యను తీసుకువెళ్లామ‌న్నారు. తాము ఎవ‌రిని క‌లిసినా ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు. దీంతో త‌మ స‌మ‌స్య‌ను నేరుగా సీఎం దృష్ట‌కి, స‌మాజం దృష్టికి తీసుకు వెళ్ల‌డం కోసం బాధితుల మంతా క‌లిసి మేడ్చ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో దాదాపు 400 వ‌ర‌కు నామినేష‌న్లు వేయాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు.