పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీరెడ్డికి భారత పౌరసత్వం నిరాకరణ

– నిబంధనలు పాటించలేదంటూ కలెక్టర్ లేఖ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశించిన ఝాన్సీ రెడ్డికి అడ్డంకి ఎదురైంది. అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ నిబంధనల మేరకు నిరాకరించారు. దీంతో ఆమెకు ఎన్నికల్లో పోటీకి ఇప్పుడు సమస్యగా మారింది. పౌరసత్వ నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న తర్వాత 12 నెలలు ఇండియాలో నివసిస్తే పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఝాన్సీ రెడ్డి గత ఏడాది జూన్ నెల 16న ఇండియాకు వచ్చారు. గత నెల 25న భారత పౌరసత్వం కోసం హైదరాబాద్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. పౌరసత్వం మార్పు ఆశించే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇండియాలో 12 నెలలు నివసించాలనే నిబంధన పాటించనందున ఆమె పౌరసత్వాన్ని నిరాకరించినట్లు కలెక్టర్… ఝాన్సీ లక్ష్మీ రెడ్డికి పంపించిన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్న ఝాన్సీ రెడ్డికి అడ్డంకులు ఎదురయ్యారు. ఝాన్సీ రెడ్డికి అవకాశం లేకపోతే ఆమె కోడలను పాలకుర్తి బరి నుంచి పోటీలో నిలిపే అవకాశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది.

మంత్రి ఎర్రబెల్లికి ధీటైన అభ్యర్థిగా ఝాన్సీ రెడ్డిని భావించినప్పటికీ, సాంకేతిక కారణాలతో సమస్య ఎదురైనందున కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయాన్ని ఆలోచించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో నిలిచేది తానే అంటూ స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె పౌరసత్వం అడ్డంకిగా మారింది. పాలకుర్తి నుంచి మరో ఎన్నారై ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.

Latest News