రెండు వైపులా రాజకీయ దాడి
స్వపక్షం క్రమశిక్షణ కమిటీకీ
విపక్షం ఎన్నికల కమిషన్ కూ
ట్రైయాంగిల్ పొలిటికల్ హీట్
Konda Surekha | విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ( Konda Surekha ), ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు( Konda Murali ) ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒంటరయ్యారు. జిల్లాలో ఇటీవల కొండా దంపతులు బహిరంగవేదికలపై మాటలు తూలిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో విమర్శించడానికి అవకాశం కోసం ప్రత్యర్థులు కాచుకుని ఉంటారు. అవకాశం రాగానే.. విరుచుకుపడతారు. ఇక్కడా అదే జరిగింది. కానీ, కొండా కుటుంబం విషయంలో స్వంత పార్టీ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. దీనికి తోడు ప్రతిపక్షం నుంచి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నా.. సురేఖ దంపతులకు ఎవరూ మద్దతుదారులుగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు జిల్లా అధ్యక్షులు, కుడా చైర్మన్ బహిరంగంగానే సురేఖ దంపతులను వ్యతిరేకిస్తున్నారు. మంత్రి సీతక్క, మిగిలిన ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కారణాలేమైనా ఇప్పటికే మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి సురేఖను తప్పించారు. ఒకటి, రెండు విషయాల్లో సురేఖ మాట్లాడిన అంశాలు వివాదాస్పదంగామారి, పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించిన విషయం తెలిసిందే.
నోరు జారితే…పేరు బద్నామ్
ఉమ్మడి జిల్లాకు చెందిన సొంత పార్టీ ప్రజాప్రతినిధులను రాహుల్ జన్మదినం వేడుకల్లో మురళి బహిరంగంగా తూలనాడటంతో వివాదం భగ్గుమన్నది. దానికి తోడు ఆర్యవైశ్యుల సమావేశంలో కొండా మురళి మాట్లాడుతూ ఎన్నికల ఖర్చుపై నోరుజారడం ప్రత్యర్ధిపార్టీలకు చాన్స్ ఇచ్చినట్టయింది. స్వంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక వైపు, ప్రత్యర్ధి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మరోవైపు ఫిర్యాదులు చేశారు. ఇదంతా కొండా దంపతుల స్వయంకృతాపరాధంగా పలువురు అభివర్ణిస్తున్నారు. కొండా మురళి తమను తీవ్రంగా విమర్శించడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలూ, పార్టీ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. పార్టీకి తాము కావాలో.. కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోండంటూ తేల్చిచెప్పారు. తదుపరి మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై ఆరు పేజీల లేఖ ఇచ్చి, మీడియాతో మాట్లాడిన అంశాలతో విభేదాలు మరింత ముదిరాయి. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ కురువృద్ధుడు రామ సహాయం సురేందర్ రెడ్డిని ఈ గొడవలోకి లాగడంతో సమస్య జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో కొండా మురళిపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. 4వ తేదీన రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పర్యటన ఉన్న నేపథ్యంలో 5వ తేదీ వరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలని అల్డిమేటమ్ జారీ చేశారు.
కొత్త చిక్కులు… విపక్షాల ఫిర్యాదు
స్వంత పార్టీ ప్రజాప్రతినిధులతో లొల్లి సాగుతుండగానే ఆర్యవైశ్యుల సమావేశంలో మురళి మాట్లాడుతూ వరంగల్ తూర్పులో మొన్నటి ఎన్నికల్లో సురేఖను గెలిపించేందుకు తాను 16 ఎకరాలు అమ్మి, రూ.70 కోట్లు ఖర్చుచేశానని, తనకు 500 ఎకరాల భూమి ఉందని చెప్పడం వారిని మరింత చిక్కుల్లోకి నెట్టింది. ఈ అంశంపై వరంగల్ తూర్పులోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ నుంచి పోటీచేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు వేర్వేరుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని విన్నవించారు. 2023 ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరు మీద ఒక ఎకరం, తన భర్త మురళి పేరున 13.31 ఎకరాలు ఉన్నాయని తూర్పు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సురేఖ పొందుపరిచారని అందులో పేర్కొన్నారు. కానీ, మురళి 2025జూన్ 28న ఆదివారం వరంగల్ లో జరిగిన సమావేశంలో మాట్లాడినప్పుడు తనకు 500 ఎకరాల భూమి ఉందని 16 ఎకరాలమ్మి రూ. 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారని, ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖ సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. దీంతో ఉన్న సమస్యలతోపాటు కొత్త సమస్య వచ్చిపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కొండా దంపతుల మధ్య పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. మరో వైపు ఎర్రబెల్లి కుటుంబంపైన మురళి విమర్శలు చేయడంతో ప్రదీప్ రావు అదే స్థాయిలో మండిపడ్డారు. ఎర్రబల్లులు అంటు వారిని అభివర్ణించగా మురళిని పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ ప్రదీప్ రావు పేర్కొన్నారు. పరస్పర విమర్శలతో ట్రైయాంగిల్ రాజకీయ వేడి పెరుగుతోంది.