– ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగం
– మార్పు దిశగా ఓరుగల్లు ఓటరు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిన్నటి వరకు పాటించిన నిశ్శబ్దాన్ని ఓరుగల్లు ఓటరు ఛేదించారా? అంటే నిజమనే ట్రెండ్ కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలివీస్తోందనీ, ప్రభుత్వ వ్యతిరేకత బహిర్గతమైందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్, బీజేపీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ అనుకూల వాతావరణం వ్యక్తమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అండదండగా నిలిచిన ఓరుగల్లు ఓటర్లు ఈసారి భిన్నమైన దిశను ఎంచుకున్నారా? అనే చర్చసాగుతోంది. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, అనుకూలతను పక్కకుపెడితే ప్రజలు నిజంగానే మార్పును కోరుకున్నారనే అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిత్రమేమిటంటే బీఆర్ఎస్ తో ఢీఢీ అనే తీరుగా తమ వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తపరచకుండా ఓటర్లు సైతం అత్యంత తెలివిగా వ్యవహరించారనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఫలితాలు ఎలా? ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఫలితాలొస్తాయనే అంచనాతో ఉన్నారు.
12 స్థానాల్లో బీఆరెస్ కు గడ్డుపరిస్థితి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 సెగ్మెంట్లలో మెజార్టీ స్థానాలకు ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు భావిస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి బహిరంగ వ్యతిరేకత వ్యక్తం కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఈదిశలోనే సాగారు. తమ బిడ్డలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించలేదనే వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళల్లో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు స్థానికంగా అభ్యర్థులపై వ్యతిరేకత తీవ్రంగా కన్పించింది. కనీస ప్రజాస్వామిక హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛాపూరిత వాతావరణం తదితర అంశాలపై పౌర, ప్రజాసంఘాలు ఈ దఫా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిలబడ్డాయి. బీఆర్ఎస్ అనుకూల మేధావి, ప్రజా సంఘాలు సర్కారును సమర్థించుకోలేని స్థితిలోకి చేరుకున్నారు.
– సిటింగులపై వ్యతిరేకత
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కారణాలేవైనా రెండు స్థానాల్లో స్టేషన్ ఘన్ పూర్, జనగామల్లో సిటింగ్ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలను కాదని ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను బరిలో దింపగా ములుగులో బడే నాగజ్యోతిని బరిలో నిలిపారు.
– మెజార్టీ స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు
సిటింగుల్లో నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధిస్తుండగా, మిగిలిన చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైనట్లు భావిస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయావకాశాలుండగా, మూడు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ కు అవకాశం ఉండగా, రెండు స్థానాల్లో బీజేపీ అనుకూల పరిస్థితి నెలకొన్నట్లు అంచనా వేస్తున్నారు. మూడు స్థానాల్లో పోటాపోటీ తీవ్రంగా ఉంది. ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతో గెలిచే అవకాశం ఉంది.