టీవీ చ‌ర్చ‌లో త‌న్నులాట‌

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అధికార, విపక్ష రాజకీయ పార్టీల మధ్య రచ్చ జరిగింది. సోమవారం ఒక టీవీ చానల్ వరంగల్ కోటలో చర్చా వేదిక ఏర్పాటు చేసింది.

– బీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ ఆగ్రహం

– ఒక టీవీ చర్చలో పార్టీల మధ్య లొల్లి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అధికార, విపక్ష రాజకీయ పార్టీల మధ్య రచ్చ జరిగింది. సోమవారం ఒక టీవీ చానల్ వరంగల్ కోటలో చర్చా వేదిక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య గొడవ జరిగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, నెలకొన్న సమస్యలపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని, పరస్పరం దూషించుకున్నారు. ఒకరి అనుచరులు మరొకరిపై దాడికి ప్రయత్నించారు.

బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, బీఆర్ఎస్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అనుచరుల మధ్య రచ్చ ముదిరింది. లోకల్, నాన్ లోకల్ అంటూ పరస్పరం దూషణలకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దాడి చేసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని నివారించేందుకు ప్రయత్నించారు. ఒక దశలో చానల్ నిర్వాహకులు, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. కార్యకర్తలకు ఎంత నచ్చ చెప్పినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చానల్ నిర్వాహకులు కూడా పదే పదే చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తూ చర్చను అర్ధంతరంగా ముగించారు.