anti-labour laws | కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి.. వరంగల్‌లో భారీ కార్మిక ప్రదర్శన

  • Publish Date - July 9, 2025 / 10:51 PM IST

Anti Labour Laws | విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ చౌరస్తా వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, న్యూ డెమోక్రసీ పార్టీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు, రైతు సంఘాల నాయకులు సోమిడి శ్రీనివాస్, సుధమల్ల భాస్కర్ తదితర నాయకులు మాట్లాడారు. కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రిటీషు పరిపాలనా కాలంలో సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు మెరుపు సమ్మెలు చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్మికవర్గాన్ని మంచి చేసుకోవడానికి 1948లో కనీస వేతనాలు, ఫ్యాక్టరీ చట్టం, ఇ.ఎస్.ఐ, పారిశ్రామిక వివాద చట్టాలను భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న ఈ చట్టాలన్నింటినీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం పోటుతో నిర్వీర్యం చేస్తోందన్నారు.

కార్మికుల నియామకం, కార్మికులను తొలగించే ‘హైర్ & ఫైర్’ విధానాన్ని యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేశారని విమర్శించారు. యావత్తు కార్మికవర్గాన్ని బ్రిటీష్ కాలం నాటి పద్ధతిలో కట్టు బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిని అడ్డుకోవడం నేడు కార్మికవర్గ ముఖ్య కర్తవ్యమని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్, ఏఐసీటీయూ రాష్ట్ర నాయకులు నర్ర ప్రతాప్, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు పాశం రవి, ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ, ఐ‌ఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు బండి కుమార్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులతోపాటు కార్మిక రంగాలలో పనిచేసిన నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.