Site icon vidhaatha

చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి పొన్నం

ponnam

చేనేత కార్మికులను తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

నేత కార్మికులకు చేతినిండా పని కల్పించే బాధ్యత మాదే!

బిజెపి, టిఆర్ఎస్ లవి శవ రాజకీయాలు

నాలుగు నెలల పాలనలో 120 కోట్ల వర్క్ ఆర్డర్లు ఇచ్చాం

ఇప్పటికే 1080 కోట్ల బకాయిల విడుదల

చావులు సమస్యలకు పరిష్కార మార్గం కాదు

రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్

విధాత బ్యూరో, కరీంనగర్: చేనేత కార్మికులను తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నేత కార్మికులకు చేతినిండా పని కల్పించే బాధ్యత తమదే అన్నారు. సోమవారం సిరిసిల్ల డిసిసి కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.

గ‌త‌ నాలుగు నెలల కాలంలోనే సిరిసిల్ల నేత కార్మికులకు 120 కోట్ల విలువచేసే వర్క్ ఆర్డర్స్ ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో గతంలో టిఆర్ఎస్ ఇచ్చిన ఆర్డర్ల కన్నా, ఎక్కువగానే తాము ఇక్కడి నేత కార్మికులకు ఇస్తామన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించి గత బకాయిలన్నీ చెల్లిస్తామన్నారు. చావులే సమస్యలకు పరిష్కార మార్గం కాదని ఆయన తెలిపారు.

సిరిసిల్ల నేతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో చర్చించానని, ఒకటి రెండు వాయిదాలలోనే పెండింగ్ బిల్లులు విడుదల చేయడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. ఇప్పటికే 180 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, దానిద్వారా సాంకేతికంగా వృత్తిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై బిజెపి, టిఆర్ఎస్ శవ రాజకీయాలు సాగిస్తున్నాయని ఆరోపించారు. గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఆ రెండు పార్టీల ప్రభుత్వాలే కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వస్త్ర పరిశ్రమపై 12 శాతం జీఎస్టీ విధించిందని, జాతీయ చేనేత బోర్డు, టెక్స్ టైల్ బోర్డు, మహాత్మా గాంధీ గుణకార బీమా యోజన, ఆరోగ్య బీమా పథకాలను రద్దు చేసిందని, తద్వారా చేనేత కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ప్రమోషన్ల కోసం కేంద్రం ఎస్ ఐ డి పి కింద వేలకోట్ల నిధులు విడుదల చేస్తోందని, ఈ నెల 10న చేనేత దీక్ష చేస్తానంటున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆ పథకం కింద రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.

పవర్ లూమ్ క్లస్టర్ వరంగల్లులో ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబితే, దానిపై సంజయ్ కనీసం నోరు మెదపలేదన్నారు. ఇక టిఆర్ఎస్ నేతలు చేనేత పరిశ్రమను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొనే ప్రయత్నం చేశారని, ఉద్యమ సమయంలో అమరుల పేరు చెప్పి శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు నేత కార్మికుల విషయంలోనూ వ్యవహరించారని తెలిపారు. సిరిసిల్ల నేత కార్మికుల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు పెళ్లయిన తర్వాత వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపినట్టున్నాయన్నారు.

Exit mobile version