“కేసీఆర్ నువ్వు ఓడిపోతే ఏమి పోదనుకోకు… నువ్వు మింగిన లక్ష కోట్లు కక్కిస్తాం, ఆక్రమించిన10 వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకుంటాం.” అని తాండూరు విజయ భేరి సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్..నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా అని అడిగారు. కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ కు తెలిసిపోయిందని, అందుకే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెప్పాడన్నారు. కేసీఆర్ తన ఓటమిని అచ్ఛంపేటలో ముందే ఒప్పుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ అభివృద్ధికి పునాదులు వేస్తే.. మీరు వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేమి లేదన్నారు.
వైఎస్ హయాంలో తాండూరుకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నామని చెప్పారు. మీరు భుజాలపై మోసి గెలిపిస్తే పైలట్ రోహిత్ రెడ్డి వందల కోట్లకు అమ్ముడు పోయాడన్నారు. భూ కబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆరెస్ తన అభ్యర్థిగా నిలిపిందని ఆరోపించారు. ఎప్పుడు ఒకరిపై ఒకరు కాలుదువ్వుకునే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే… ఇవాళ ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. కర్నాటకలో అక్కడి ప్రజలు డీకే శివకుమార్ ను లక్ష 20వేల మెజారిటీతో గెలిచారని, కొడంగల్, తాండూరు, పరిగి నియోజకవర్గాలలో కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.