విధాత, హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. 29న క్యాబినెట్ సమావేశం జరుగుతుందని తొలుత వార్తలు వచ్చాయి. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 29న మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశాలు కనిపించడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. సీఎం అనారోగ్యం కూడా ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు. 29న కాకపోతే అక్టోబర్ మొదటివారంలో జరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
కొందరు అధికారులు మాత్రం 29న సమావేశం ఉంటుందని తమకు సమాచారం వచ్చిందని పేర్కొనడం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నిర్వహించనున్న క్యాబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. క్యాబినెట్ భేటీకి ఎజెండాను శాఖలు ఏవీ పంపొద్దని మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు చెబుతున్నారు.
కేవలం సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టిన ఫైళ్లపైనే చర్చలు జరుగుతాయని, వాటిని మాత్రమే అమలు చేయనున్నారని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి కూడా రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేసేవే అయి ఉంటాయని చెబుతున్నారు.