ఇకనైనా పాలన పరుగులు పెట్టేనా? పథకాల అమలుకు ఆర్థిక బ్రేక్‌లు

ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు దిశగా ప్రభుత్వ పాలన ఇకనైనా పరుగులు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది

  • Publish Date - June 11, 2024 / 04:45 PM IST

భారీగా పేరుకున్న పెండింగ్ బిల్లులు
భారంగా మారిన రైతు రుణమాఫీ
రైతుబంధు.. పంటల బీమాలో జాప్యం
ప్రత్యామ్నాయ వనరులపై సర్కార్ నజర్‌
కేబినెట్ విస్తరణ..నామినెటెడ్ పదవుల భర్తీ
స్థానిక ఎన్నికలు కాంతకాలం వాయిదానే!
సీఎస్ నుంచి క్షేత్ర స్థాయి వరకు బదిలీలు
ఆశాజనకంగా రుతు పవనాలు
విధాత : ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు దిశగా ప్రభుత్వ పాలన ఇకనైనా పరుగులు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. అయితే.. వాటికి ఆర్థిక ఇబ్బందులు బ్రేక్‌ వేయకుండా అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల అన్వేషణపై కసరత్తు చేస్తున్నది. దాదాపుగా 6.71 లక్షల కోట్ల అప్పుల భారం నెత్తినేసుకుని మొదలైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రయాణంలో ఆర్థిక వనరుల కొరత అడుగడుగునా సవాళ్లు విసురుతున్నది. వరుసగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో అవకాశాల మేరకు అప్పుల మీద అప్పులు చేస్తూ బాండ్లు తాకట్టు పెడుతూ పరిపాలన బండి నెట్టుకొస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలు ఇంకా పెండింగ్‌లో ఉండటం కాంగ్రెస్ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య భారీ అంతరం ఏర్పడటంతో దాన్ని భర్తీ చేయడంపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కత్తిమీద సాము చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాటికి తోడు రైతు రుణమాఫీకి రూ.33,000 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల వరకు అవసరమని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని, నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించడంతో, ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణమాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని సమాచారం. దీనికి రిజర్వ్ బ్యాంకు అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూర్చుకోవాల్సివుంటుంది. అలాగే రైతుల పంట బీమాకు ప్రభుత్వం ఏటా 2వేల కోట్ల ప్రీమియం చెల్లించాల్సివుంది. రాష్ట్రంలో 1.32కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా 2019నుంచి ఫసల్ బీమా అమలులో లేదు. ఇప్పుడు ప్రభుత్వం పంటల బీమాకు ప్రీమియం భరించాల్సివుంది. ఇకపోతే రైతుబంధు ఖరీఫ్ పంటల సాగు ప్రారంభమైనా ఇంకా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. నియోజకవర్గం అభివృద్ధి నిధులు 10 కోట్లు మంజూరు చేయగా, అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి.

సమస్యగా మారనున్న హామీల అమలు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు ప్రభుత్వం మెడకు గుదిబండగా మారింది. ఎన్నికల హామీల అమలుకు ముందడుగు వేద్దామంటే చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలతో రేవంత్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఇప్పటికే ఆరునెలల్లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి 12905 కోట్ల అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలతో కలిపి చెల్లింపులకు రేవంత్ ప్రభుత్వం సగటున రోజుకు రూ.290 కోట్ల మేరకు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలకు ప్రతినెలా రూ.2500 భృతి ఇస్తామని, రైతులకు 2లక్షల రుణమాఫీ, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంట క్వింటాల్‌కు రూ.500 బోనస్, విద్యార్థులకు రూ.5లక్షల విద్యాభరోసా కార్డు, పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 బోనస్, 4వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు, వృద్ధులకు 4వేల పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరుకు భారీగా నిధులు అవసరముంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు, ధరణి పోర్టల్ మార్పులు, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్‌ భారం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం బకాయిలు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులతో పాటు రోడ్లు, నాలాల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు సమాచారం. ఆయా సమస్యలకు తోడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాహణ.. వడ్డీలు, విద్యుత్తు బిల్లుల భారం మరింత గుదిబండగా తయారైంది. ప్రణాళిక ప్రకారం ఆదాయ వనరులు సమకూరక ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌ బిల్లులు పేరుకుపోతుండగా, కాంట్రాక్టర్లకు ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో, వారు తామిక ఎదురు పెట్టుబడి పెట్టలేమని వాపోతున్నారు. వారితో అభివృద్ధి పనులు చేయించలేక అధికారులు అపసోపాలు పడుతున్నారు. పౌరసరఫరాల శాఖలోనూ పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు లారీ కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియల్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వాడుతున్న కార్లకు ఏడాదిగా బిల్లులు చెల్లించకపోవడం ప్రస్తుత ప్రభుత్వానికి మరో ఆర్థిక భారం. ఇదే పరిస్థితి ఇతర కార్పొరేషన్లలోనూ ఉందంటున్నారు.

ఆదాయాన్వేషణపై ఫోకస్‌
సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఎన్నికల హామీల అమలుకు కావాల్సిన నిధుల సమీకరణకు ఆదాయ వనరుల ఆన్వేషణలో భాగంగా అప్పులు ఒక భాగమైతే రాష్ట్ర పరిధిలో ఎంతమేరకు ఆదాయం పెంచుకోవచ్చన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు ప్రధానంగా భూములు విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్‌ విభాగాల్లో ఉన్న లోపాలను సవరించి మరింత ఆదాయం వచ్చేలా చూడటంపై దృష్టి పెట్టారు. భూముల విలువ పెంపు, రిజిస్ట్రేషన్ చార్జిలను పెంచడం, భూమార్పిడి, ఎల్‌ఆర్‌ఎస్‌ల ద్వారా అదనపు ఆదాయానికి ప్రయత్నిస్తున్నదని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో భూములు సామాన్యులకు అందుబాటులో లేని స్థాయిలో ఉన్నాయి. వాటిని మరోసారి పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళన సైతం ప్రభుత్వాన్ని పరేషాన్ చేస్తున్నది. ప్రజలకు ఇబ్బంది లేకుండా భవన నిర్మాణాలు, లేఅవుట్‌ల కోసం హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో డీపీఎంఎస్ బదులుగా టీజీ బీపాస్ ద్వారా అనుమతులివ్వాలని నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ ద్వారా భూముల అమ్మకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. అవుటర్‌, త్రిపుల్ ఆర్‌ల మధ్య రియల్ బూమ్‌కు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను సైతం సక్రమంగా అమలు చేయడం ద్వారా దుబారాను అరికట్టేందుకు ప్రభుత్వం ఆలోచనగా చేస్తున్నది. హరితహారం, పట్టణ, పల్లె ప్రగతి, చేప పిల్లల పంపిణీ స్కీమ్‌లను కొత్త విధానంలో అమలు చేయాలని విధి విధానాలను రూపొందిస్తున్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి పెట్టుబడుల సమీకరణకు సైతం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

స్థానికం వాయిదానే
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో లక్ష్యాలను చేరుకోలేకపోవడం..పార్లమెంటు ఎన్నికలలో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో పరిస్థితి అనుకూలంగా లేనందునా స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అదిగాక ఆక్టోబర్ నుంచి మొదలైన ఎన్నికల కోడ్ డిసెంబర్ 5న ముగిసిపోగా, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 16నుంచి జూన్ 6వరకు కొనసాగింది. మళ్లీ స్థానిక ఎన్నికల నిర్వాహణతో మరింత కాలం పరిపాలనలో స్తబ్ధతకు అవకాశం ఏర్పడనుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుల గణన పూర్తి చేసి పక్కాగా రిజర్వేషన్లు ఖరారు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని, అప్పటిదాకా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు వెసులుబాటు చిక్కుతుందని, ఇచ్చిన హామీలలో మరికొన్నింటిని అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

వారం రోజుల్లో సీఎస్ నుంచి క్షేత్ర స్థాయి వరకు బదిలీలు
అసెంబ్లీ ఎన్నికల పిదప పరిపాలనపై పట్టు సాధించే క్రమంలోనే పార్లమెంటు ఎన్నికలు ముంచుకురావడంతో పాలన వ్యవస్థను గాడిలో పెట్టడంలో రేవంత్ ప్రభుత్వం వెనుకబడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నుంచి క్షేత్ర స్థాయి ఉద్యోగులు, జిల్లా పాలనాధికారులు, శాఖాధిపతులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల వరకు పెద్ద ఎత్తున బదిలీలకు ప్రభుత్వం సిద్ధపడింది. అన్ని శాఖల్లో బదిలీల పర్వం మొదలైంది. ఇంచార్జిల స్థానంలో పూర్తి స్థాయి అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త సీఎస్‌గా వికాస్‌రాజ్‌, జయేశ్ రంజన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా వికాస్ రాజ్ పేరు వినిపించింది. పోలీస్ శాఖలోనూ ఐపీఎస్‌లు, డీజీపీ సహా కమిషనర్లకు స్థాన చలనం తప్పదన్న కథనాలు వెలువడుతున్నాయి. ప్రజావాణి పునఃప్రారంభించారు.

కేబినెట్ విస్తరణ..నామినెటెడ్ పదవుల భర్తీ
పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసే క్రమంలో కెబినెట్ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు అధిష్టానం ఇచ్చిన హామీలు, ఇతర పార్టీల నుంచి వచ్చే వలస నేతల మేరకు కేబినెట్ విస్తరణ జరుగవచ్చంటున్నారు. రాష్ట్ర కెబినెట్‌లో 18మందికి అవకాశముండగా, ప్రస్తుతం సీఎం సహా 12మంది మంత్రులున్నారు. మరో ఆరుగురు మంత్రుల భర్తీకి అవకాశముంది. ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు కెబినెట్ విస్తరణలో చాన్స్ దక్కవచ్చు. అటు పదవుల కోసం ఎదురుచూస్తున్న పార్టీ నాయకుల కోసం నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు 37కార్పోరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించగా, మిగిలిన 17 కార్పొరేషన్లతో పాటు దేవాలయాల పాలకమండళ్ల భర్తీతో మరికొందరికి పదవుల యోగం కల్పించనున్నారు.

Latest News